రంగారెడ్డి, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : మూసీనదికి చెత్త గండం పొంచి ఉన్నది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని బండరావిరాల వద్ద ప్రభుత్వం డంపింగ్ యార్డును ఏర్పాటు చేయా లని నిర్ణయించింది. హైదరాబాద్ నగరం నుంచి ప్రవహించే మూసీ బండరావిరాల పక్క నుంచే వెళ్తుంది. బండరావిరాలలోని సర్వేనంబర్ 268లో సుమారు 494 ఎకరాల ప్రభుత్వ భూమి ఉం డగా.. అందులోని కొంతభాగంలో డంపింగ్‌యార్డును ఏర్పాటు చేసి.. నగరంలో సేకరించిన చెత్తను అక్కడ డంపింగ్‌చేసి రీసైక్లింగ్ చేయాలని సర్కార్ యోచిస్తున్నది. అక్కడ డంపింగ్ యార్డు ఏర్పాటైతే బండరావిరాల చుట్టూ ఉన్న సుమారు 15 గ్రామాలు బండరావిరాల, చిన్నరావిరాల, గువ్వలేటి, సద్దుపల్లి, దేశ్‌ముఖ్, పిలాయపల్లితోపాటు పక్కనే ఉన్న విజ్ఞాన్, సెయింట్‌మేరీ యూనివర్సిటీల్లోని దాదాపు 30,000 విద్యార్థులపై తీవ్ర ప్రభా వం చూపనున్నది. తీవ్ర పర్యావరణ ముప్పు ఏర్పడే అవకాశమున్నది. అయినా ప్రభుత్వం మొండిగా అక్కడే డంపింగ్‌యార్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేకంగా జీవోను కూడా విడుదల చేసింది. ఇప్పటికే బండరావిరాలతోపాటు పరిసరాల్లో ఉన్న సుమారు పదిహేను గ్రామాల ప్రజలు డంపింగ్‌యార్డును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపడుతున్నారు.
మరోవైపు కొత్తూరు మండలంలోని సిద్ధాపూర్లో గత కేసీఆర్ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటు కోసం భూములను సేకరించింది. కాగా, అసెంబ్లీ ఎన్నికలొచ్చి.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ భూముల్లో పరిశ్రమలను ఏర్పాటుచేయకుండా డంపింగ్‌యార్డు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. తమ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటైతే తమకు ఉపాధి , ఉద్యోగావకాశాలు లభిస్తాయని గత ప్రభుత్వానికి భూములిస్తే.. వాటిలో డంపింగ్ యార్డు ను ఏర్పాటు చేస్తామంటే ఊరుకునేది లేదని సిద్ధాపూర్వాసులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సిద్ధాపూర్‌తోపాటు పరిసర గ్రామాలకు చెందిన వందలాది మంది సిద్ధాపూర్లో కాలుష్యకారక పరిశ్రమలొస్తే పర్యావరణ ముప్పు అని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఉన్న చెత్తను బండరావిరాల, సిద్ధాపూర్ గ్రామాల్లో డంపింగ్‌యార్డులు ఏర్పాటు చేసి తరలించాలని చూడడం పూర్తిగా ప్రజా వ్యతిరేకం. ప్రభుత్వం విలువైన భూముల్లో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయడం దారుణం. తమ గ్రామాల్లో డంపింగ్ యార్డులు వద్దే..వద్దని అక్కడి ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నా సర్కార్ మొండిగా ముందుకెళ్లడం మంచిదికాదు. డంపింగ్‌యార్డుల ఏర్పాటుకు జారీ చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి. హైదరాబాద్ చుట్టూ ఉన్న విలువైన ప్రభుత్వ భూముల్లో పరిశ్రమలను ఏర్పాటుచేసి ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి.
-మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం
అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని బండరావిరాలలో డంపింగ్‌యార్డు ఏర్పాటు చేస్తే 15 గ్రామాలతోపాటు రెండు యూనివర్సిటీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మూసీకి అత్యంత సమీపంలో ఉన్న బండరావిరాలలో చెత్తను డంపింగ్ చేస్తే దాని నుంచి వెలువడే వ్యర్థపదార్థాలు మూసీలో కలిసే ప్రమాదం ఉన్నది.
-కందికంటి విజయ్‌కుమార్, బండరావిరాల సర్పంచ్
హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాల్సింది పోయి, ప్రజల మనుగడుకు ముప్పుగా మారిన డంపింగ్‌యార్డు ఏర్పాటు సమంజసం కాదు. బండరావిరాలలో డంపింగ్ యార్డు వద్దే..వద్దు.
-గుండ్ల సతీశ్‌యాదవ్