సిటీబ్యూరో, ఆగస్టు 6 ( నమస్తే తెలంగాణ) : రేవంత్ సర్కార్‌పై డ్రైవర్లు, యాప్ ఆధారిత కార్మికులు రగులుతున్నారు. డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో వాహన యాప్, కనీస చార్జీలు, సామాజిక భద్రత అందిస్తామని మాటిచ్చి తమను మోసం చేసిందని వాహన సంఘాల జేఏసీ ఆగ్ర హం వ్యక్తం చేసింది. అందులో భాగంగా ప్రభు త్వ నిరక్ష్యాన్ని ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. శనివారం నుంచి వాహన సేవలతోపాటు అన్ని రకాల యాప్ ఆధారిత డెలివరీ సేవలు బంద్ కానున్నాయి.సుమారు 4 లక్షల మంది కార్మికు లు సమ్మెలో పాల్గొంటారని జేఏసీ నాయకులు తెలిపారు.
ఇప్పటికే ప్రభుత్వానికి అనేకసార్లు తమ గోడు వెల్లబోసుకున్నామని.. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా బీఆర్టీయూ క్యాబ్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్ మాట్లాడు తూ..యాప్ ఆధారిత రవాణా సేవలకు ప్రభు త్వం, ప్లాట్ఫారం కంపెనీలు కలిసి కనీస బేస్ ఫేర్, అలాగే ప్రతి కిలోమీటరుకు,ప్రతి నిమిషానికి న్యాయమైన చార్జీలను ప్రభుత్వం నోటిఫై చేసి యాప్ ఆధారిత డ్రైవర్లు, డెలివరీ వరర్లు, అన్ని గిగ్, ప్లాట్ ఫారమ్ కార్మికులకు స్థిరమైన ఆదాయం లభించేలా చూడాలన్నారు.
తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫారమ్ వరర్స్ రూల్స్‌ను వెంటనే నోటిఫై చేసి, గిగ్, ప్లాట్‌ఫారమ్ వరర్స్ వెల్ఫేర్ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు. మోటర్ వెహికల్స్ చట్టం-1988, మోటర్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు- 2025 ప్రకారం కమర్షియల్ రిజిస్ట్రేషన్‌కు మార్చకుండా ప్రైవేట్ (నాన్-కమర్షియల్) ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలను యాప్ ఆధారిత ప్రయాణికుల లేదా సరుకు రవాణా సేవలకు ఉపయోగించడాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఇస్తానన్న ఏడాదికి రూ.12వేలు అందించాలని అన్నారు. కార్యక్రమంలో టీజీపీడబ్ల్యూ సలావుద్దిన్, సీఐటీయూ అజయ్ బాబు, ఐఎల్డబ్ల్యూఎఫ్ ఇనాయత్ అలీబక్రీ, టీఆర్టీయూ ఎం.ఎ.సలీం, ఐఎన్టీయూసీఎఫ్. రామకృష్ణారెడ్డి, టీఎంసీడీఏ అబ్దుల్ రవూఫ్, బీఎంఎస్ సంతోష్ పాల్గొన్నారు.