రాట్నం వడికి జాతికి కప్పుకోవడానికి బట్టనిస్తున్న నేతన్న ఇవాళ తన పాలకులపైనే తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకంగా పనిచేసిన వర్గాల్లో చేనేత వర్గం చాలా ముఖ్యమైంది. తెలంగాణ సాధన అంటే కేవలం రాజకీయంగా రాష్ట్రం ఏర్పడటమే కాదనీ, తమ వృత్తికి గౌరవం, తమకు ఉపాధి, భరోసా, తమ కళకు మంచి మార్కెట్ వస్తుందని నేతన్నలు ఆశించారు. వ్యవసాయం తరువాత గ్రామీణ జనజీవనానికి జీవనాధారంగా నిలిచిన చేనేత రంగం తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. పోచంపల్లి ఇక్కత్, గద్వాల పట్టు, నారాయణపేట చీరలు, సిరిసిల్ల వస్ర్తాలు, వరంగల్ దుర్రీలు, కరీంనగర్, సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల చేనేత ఉత్పత్తులు తెలంగాణకు ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. తెలంగాణ సంస్కృతి చేనేత వస్ర్తాల్లో మిళితమైన పరంపరాగత కళలో ప్రతిబింబించింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత రంగాన్ని ఒక ప్రధాన ఆర్థిక వ్యవస్థగా గుర్తించి, దాని అభివృద్ధికి అనేక మార్గాల్లో ముందడుగు వేసింది. చేనేత రంగాన్ని కేవలం సంక్షేమ కోణంలో కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో భాగంగా పరిగణించింది. సిరిసిల్ల వంటి ప్రాంతాలను కేవలం చేనేత పట్టణాలుగానే కాకుండా ఆధునిక వస్త్ర తయారీ కేంద్రాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పలు కార్యక్రమాలు చేపట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ముఖ్యమైన కార్యక్రమాల్లో ‘నేతన్నకు చేయూత’ అత్యంత ప్రాధాన్యమైనది. వేలాది చేనేత కుటుంబాలకు ఇది ఆర్థిక రక్షణగా నిలిచింది. నూలు సబ్సిడీ ద్వారా ముడి నూలు కొనుగోలు వ్యయం తగ్గి ఉత్పత్తి ఖర్చు తగ్గింది. ముడిసరుకు ధరల పెరుగుదలతో నష్టపోతున్న నేతన్నలకు ఈ సబ్సిడీ ఊరటనిచ్చింది. చేనేత ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడంలో బతుకమ్మ చీరల పథకం గొప్ప మైలురాయిగా చెప్పవచ్చు.
కానీ, నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ రంగంపై పూర్తిగా నిర్లక్ష్య ధోరణి కనబరుస్తున్నది. ఎన్నికల మ్యానిఫెస్టోలో చేసిన వాగ్దానాలు అమలు చేయడం దేవుడెరుగు..గతంలో కేసీఆర్ అమలు చేసిన పథకాలను కూడా నిలిపివేసే స్థాయికి దిగజారింది. నేతన్నలకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని భారీ వాగ్దానం చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్ల్లు దాటినా ఆ హామీ అమలుకు నోచుకోలేదు. నూలు సబ్సిడీ స్థానంలో ప్రతీ చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారు. కానీ ప్రభుత్వ పెద్దలు దీని ఊసే ఎత్తడం లేదు. థ్రిప్ట్ ఫండ్ చేనేత కార్మికులకు భద్రత కల్పించే గొప్ప పథకం. ఈ పథకానికి బీఆర్ఎస్ సర్కార్ విడుదల చేసిన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం తాము చేసిన ఘనకార్యంగా చెప్పుకోవడం పూర్తిగా అనైతికం. పైగా మూడేండ్ల కాలవ్యవధితో ఉన్న పథకాన్ని రెండేండ్లకు కుదించారు. దీని ద్వారా నేతన్నల కుటుంబాలకు తీవ్రమైన నష్టం జరిగింది.
పద్మశాలీల ఆత్మగౌరవ భవనం కోసం కేసీఆర్ ప్రభుత్వం కోకాపేటలో రెండున్నర ఎకరాలు, ఐదు కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. కానీ, నిధులు విడుదల చేయకుండా, నిర్మాణం జరుగనీయకుండా కాలయాపన చేస్తున్నారు. నేతన్నల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కోసం పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కానీ, దానికి నేటికీ చైర్మన్‌ను, సభ్యులను నియమించలేదు. ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు. సంస్థ అస్తిత్వాన్ని, మనుగడను ప్రశ్నార్థకంలోకి నెట్టేశారు.
సిరిసిల్లలో చేనేత కార్మికులది అత్యంత ఆందోళనకర పరిస్థితి. ఒకప్పుడు ఆత్మహత్యలకు ప్రతీకగా నిలిచిన ఈ ప్రాంతాన్ని కేసీఆర్ సర్కార్ సంక్షేమ కార్యక్రమాలు, మార్కెట్ అవకాశాలు, ప్రభుత్వ ఆర్డర్ల ద్వారా పునరుద్ధరించింది. కానీ ఇప్పుడు మళ్లీ ఉపాధి సంక్షోభం, ఆర్డర్ల ఆలస్యం, విద్యుత్తు సబ్సిడీ సమస్యలు, పథకాల నిలిపివేతతో నేత కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గత ఎనిమిది నెలల్లో 16 మందికి పైగా నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం గమనార్హం. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఆలస్యంగా ఇవ్వడం వల్ల వందలాది మరమగ్గాలు నెలల తరబడి ఖాళీగా ఉండాల్సి వచ్చింది. వేలాది కార్మికులు ఉపాధి కోల్పోయారు. విద్యుత్తు సబ్సిడీ రద్దు చేయడంతో సగానికి పైగా మరమగ్గాలు మూగబోయాయి. వర్కర్ టు ఓనర్ పథకం పూర్తిగా ఆగిపోయింది. ఒక నేతన్న మరమగ్గం ఆగిపోతే, ఒక కుటుంబం ఆదాయం ఆగిపోతుంది. ఒక గ్రామం చేనేత కోల్పోతే, ఒక సంప్రదాయం అంతరించిపోతుంది. ప్రభుత్వం వాస్తవిక దృష్టితో, చేనేత కార్మికుల హక్కులను పరిరక్షించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా సిరిసిల్ల నేత కార్మికుల సమస్యలపై వెంటనే హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలి. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. టెస్కోకు పాలక మండలి ఎన్నికలు నిర్వహించి, పాలక వర్గానికి అప్పగించాలి. చేనేత ఉత్పత్తుల్లో కనీసం 50% ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. జాతికి బట్ట నేసే చేతులు తమ బతుకుల కోసం చేయి చాచాల్సి రావడం ఏ సమాజానికీ మంచిది కాదు.