జైపూర్, ఆగస్టు 6 : సింగరేణి చరిత్రలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి విద్యుత్తు కేంద్రానికి ఒడిశా రాష్ట్రంలోని నైనీ బ్లాక్ నుంచి 4 వేల టన్నుల జీ-10 గ్రేడ్ బొగ్గుతో తొలి రైలు గురువారం జైపూర్ విద్యుత్తు కేంద్రానికి చేరుకున్నది. ఈ రైలుకు సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) సూర్యనారాయణ, డైరెక్టర్ (ఈఅండ్ఎం) తిరుమల్‌రావు, ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి ఎస్టీపీపీ వద్ద స్వాగతం పలికారు. ఒడిశాలోని నైనీ బ్లాక్ ద్వారా సింగరేణికి బొగ్గు సరఫరా కావడం ప్రత్యేక ఘట్టమని అధికారులు పేర్కొన్నారు. సింగరేణికి చెందిన ఒడిశాలోని నైనీ బ్లాక్ ద్వారా బొగ్గు తెలంగాణకు రావడం ఇదే మొదటిసారి కావడంతో ఎస్టీపీపీలో పండుగ వాతావరణం నెలకొన్నది.
నైనీ సమీపంలోని హిందోల్ రైల్వే సైడింగ్ నుంచి 59 వ్యాగన్ల బొగ్గు తెలంగాణకు చేరినట్టు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ బొగ్గును రాష్ట్ర అవసరాల కోసం వినియోగించనున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. సింగరేణి యాజమాన్యానికి, అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర విద్యుత్తు అవసరాలకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. ఒడిశా ప్రభుత్వానికి, సింగరేణి అధికారులకు సంస్థ సీఎండీ జ్యోతి బుద్ధప్రకాశ్ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జీఎం నర్సింహారావుతోపాటు అధికారులు పాల్గొన్నారు.