గణపురం, నవంబర్ 20 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నుం చి కొనుగోలు చేసిన యూరియా బస్తాలో సుద్దతో నిండిన మట్టి పెల్లలు బయటపడ్డాయి. దీంతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. చెల్పూర్ గ్రామానికి చెందిన రైతు రాసమడుగు రాజు సొసైటీ నుంచి 15 బస్తాల యూరియా కొనుగోలు చేశారు.
వాటిలో ఒక బస్తా తెరిచి పొలంలో చల్లేందుకు సిద్ధమవుతుండగా యూరియాకు బదులు సుద్ద, మట్టి ముద్దలు కనిపించాయి. వెంటనే సొసైటీ సీఈవోకు ఫోన్ చేసి విషయం చెప్పినా స్పందించలేదని, బస్తా మార్పిడి లేదా నష్ట పరిహారంపై ఎలాంటి హామీ ఇవ్వలేదని రాజు ఆవేదన చెందారు. ఈ కల్తీ సొసైటీ స్థాయిలో జరిగిందా? లేక కంపెనీ నుంచే నాసిరకం బస్తాలు వచ్చాయా? అనే అంశంపై చర్చ జరుగుతున్నది. అధికారులు వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.