ములుగు, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : వనదేవతలు కొలువైన ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో భక్తుల సౌకర్యార్థం గద్దెల ప్రాంగణాన్ని అభివృద్ది చేసేందుకు రూ.236.2కోట్లతో నూతన మాస్టర్ ప్లాన్‌ను అధికారులు సిద్ధం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే మేడారం మహాజాతర ఏర్పాట్లతో పాటు మాస్టర్ ప్లాన్‌ను ఆమోదించేందుకు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, లక్ష్మణ్‌కుమార్ హైదరాబాద్‌లోని సచివాలయంలో బుధవారం సమీక్షించారు.
ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను అనుసరించి పరిసరాలను తీర్చిదిద్దడంపై చర్చించారు. డిజైన్‌లో అవసరమైన మార్పులపై చర్చించి తగిన సూచనలు చేశారు. భక్తులకు త్వరగా దర్శనం పూర్తయ్యేందుకు ప్రస్తుతం నాలుగు చోట్ల ఉన్న దేవతల గద్దెలను ఒకే వరుసలోకి మార్చేందుకు నిర్ణయించారు. మొదట సమ్మక్క, తర్వాత సారలమ్మ, అనంతరం పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలు వరుసక్రమంలో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గద్దెల ఎత్తును కూడా పెంచాలని పూజారులు అభ్యర్థించగా దానిని పరిగణనలోకి తీసుకుంటామని మంత్రులు హామీ ఇచ్చారు.
మొత్తం రూ. 236.2 కోట్లలో గద్దెల అభివృద్ధికి రూ. 58.2 కోట్లు, గద్దెల వద్ద కళాకృతి పనులకు రూ. 6.8 కోట్లు, జంపన్నవాగు అభివృద్ధికి రూ .39 కోట్లు, భక్తులకు వసతి కల్పించేందుకు రూ. 50 కోట్లు, రోడ్ల అభివృద్ధికి రూ. 52.5 కోట్లతో పాటు ఇతర ఖర్చుల నిమిత్తం మిగిలిన నిధులను కేటాయించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నుంచి మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం తీసుకొని పనులు వేగవంతం చేస్తామని మంత్రులు పేర్కొన్నారు. సమీక్షలో ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్, ఇతర శాఖల అధికారులు, పూజారులు పాల్గొన్నారు.