ఖిలావరంగల్, మే 28: ఆపరేషన్ కగార్‌ను తక్షణమే నిలిపి వేయాలని ఎంసీపీఐ పొలిట్ బ్యూరో సభ్యులు మర్రి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డింమాండ్ చేశారు. శివనగర్‌లో మూడు రోజులుగా జరుగుతున్న ఎంసీపీఐ రాష్ట్ర ప్రథమ మహసభలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు పేరుతో ఆదివాసీలపై రాజ్య హింసను కొనసాగిస్తుందన్నారు. మావోయిస్టుల ఏరివేతను చేపట్టినామని చెబుతూ భారత పౌరులను పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపి కనీసం ఆ శవాలను కూడా వారి కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.
ఆపరేషన్ కగార్‌ను విరమించుకొని శాంతి చర్చలను జరిపి భారత పౌరుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. అడవిలో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలు దోచుకునేందుకు ఆదివాసులు అడ్డుగా ఉన్నారనే కుట్రతో చేస్తున్న ఆపరేషన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగానికి హామీ ఇచ్చిన పంటలకు గిట్టుబాటు ధరల చెల్లింపు చట్టం చేసి అమలు చేయడానికి పూనుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్‌రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీ రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకపోవడం, ఎకరాకు రూ.15 వేలు పంట పెట్టుబడి సహాయం పూర్తి స్థాయిలో అందించలేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై గ్రామీణ ప్రజలల్లో రోజు రోజుకు విశ్వాసం సన్నగిల్లుతుందన్నారు. ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి పంచాయితీ ఎన్నికలకు వెళ్లితో ఓడగొడతారనే భయంతో ప్రభుత్వం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ కేంద్ర నాయకులు మోర్తాల చందర్రావు, నర్ల చంద్రశేఖర్, పానుగంటి నర్సయ్య, మాదం తిరుపతి, మాడిశెట్టి అరుణ్‌కుమార్, తాటికొండ రవి, మాలోత్ రాజేష్‌నాయక్, సంద గణేష్, భాషిపాక రమేష్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.