వాజేడు, నవంబర్22 : మన్యంలో అలజడి నెలకొంది. గిరిజనుల హత్యతో ఏజెన్సీ గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. ములు గు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న పెనుగోలు కాలనీ(బాలలక్ష్మీపురం) గ్రామంలో గురువారం రాత్రి మావోయిస్టులు ఇన్ఫార్మర్ల నెపంతో పంచాయతీ కార్యదర్శితో పాటు అతడి వరుస సోదరుడిని హత్య చేశారు.
మృతుల కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో నిద్రిస్తు న్న కార్యదర్శి రమేశ్‌ను నల్లరంగు దుస్తులు ధరించిన ముగ్గురు గొడ్డళ్లతో నరికిచంపారు. భార్య ప్రాధేయపడినా వినకుండా నరికి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొనఊపిరితో ఉన్న రమేశ్‌ను బంధువుల సహాయంతో 108 వాహనంలో ఏటూరునాగారం వైద్యశాలకు తరలించగా మృతి చెందాడు. గొర్ల కాపరి ఉయిక అర్జున్ ఇంటికి ముగ్గురు వ్యక్తులు వచ్చి బయటకు తీసుకువెళ్లి మాట్లాడి పంపిస్తామని అతని భార్యకి చెప్పి బయటకు రాగానే గొడ్లళ్లతో నరికి హతమార్చారు.
పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నందున వారిని హతమార్చినట్లు భారత కమ్యూనిస్ట్ పార్టీ(మావోయిస్ట్టు) వెంకటాపురం-వాజేడు ఏరి యా కమిటీ కార్యదర్శి శాంత పేరిట ఘటనా స్థలంలో లేఖలు వదిలివెళ్లారు. మృతుల కుటుంబసభ్యులు రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. రమేశ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండగా, అర్జున్‌కు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఏటూరునాగారం వైద్యశాల వద్ద మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ హత్యలను ఖండిస్తూ జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన కార్యదర్శులు, ఎంపీవోలు, స్థానిక అధికారులు, గిరిజన సంఘాల నాయకులు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.
ఇద్దరి కుటుంబ సభ్యులు, బంధువులు, గిరిజనసంఘాల నేతలు కలసి వాజేడు జగన్నాథపురం వెళ్లే ప్రధాన రహదారిపై మృతదేహాలతో బైఠాయించారు. వెంకటాపురం సీఐ బండారు కుమార్, ఎస్సై తిరుపతిరావు, వాజేడు ఎస్సై రుద్రరాపు హరీశ్ అక్కడికి చేరుకొని పోలీసు శాఖతోపాటు ప్రభుత్వం తరపున అదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
1975లో చండ్రుపట్ల గ్రామానికి చెం దిన వ్యాపారి దర్శి వెంకటేశ్వరరావును అప్పటి పీపుల్స్‌వార్ అగ్రనేత కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో హత్య చేశారు. 1987లో వాజేడులో బుద్దరాజు సీతాపతిరాజును కాల్చిచంపారు. 1991లో వాజేడు పోలీస్ స్టేషన్‌ను బాంబులతో బ్లాస్టింగ్ చేసి ఆయుధాలు ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత అరుణాచలపురం గ్రామంలో రాజు, మొరుమురు గ్రామానికి చెందిన బోదెబోయిన సుందర్రావును చంపారు. 2007లో ధర్మవరం గ్రా మంలో ఆర్ఎంపీ వైద్యుడు బండారు శ్రీనివాస్‌ను, 2008లో వాజేడుకు చెందిన రైతు దంతులూరి తిరుపతిరాజు(చంటిబాబురాజు)ను పొలంలో పట్టపగలే ట్రాక్టర్పైనే కాల్చి చంపారు. 2011లో వీఆర్ఏ ఆలం కృష్ణయ్యను గొడళ్లతో నరికి హత్యచేశారు. 2016లో టేకులగూడెం గ్రామ శివారులో 163 జాతీ య రహదారి నిర్మాణ పనులకు వినియోగిస్తున్న వాహనాలను దగ్ధం చేశారు. మళ్లీ ఇప్పుడు ఇద్దరిని హత్య చేసి తమ ఉనికిని చాటుకున్నారు.
ములుగురూరల్: మావోయిస్టులు అయాయకులైన ఇద్దరు ఆదివాసీ యువకులపై ఇన్ఫార్మర్ ముద్రవేసి హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎస్పీ డాక్టర్ పీ శబరీష్ ఒక ప్రకటనలో తెలిపారు. అటవీ గ్రామానికి చెందిన విద్యా వంతు డు ఉయిక రమేశ్ మావోయిస్టు పార్టీకి సహకరించడం లేదనే కారణంతో పాశవికంగా హత్య చేశారని అన్నారు. ఇలాంటి దుశ్చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. పౌర హక్కుల సంఘాల నేతలు ఈ ఘటనపై స్పందించాలన్నారు.