వరుణుడు కరుణించాడు. వాన జాడలేక ఇటు రైతులు, ప్రజలు అల్లాడుతూ వేయికళ్లతో ఎదురుచూస్తున్న వేళ బుధవారం సాయంత్రం చిరుజల్లులతో మొదలైన వర్షం వారిలో సంతోషం నింపింది. ఉమ్మడి జిల్లాలోని హనుమకొండ, వరంగల్, జనగామ సహా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఇప్పటికే విత్తనాలు వేసిన రైతులు మొక్కలను కాపాడుకునేందుకు బిందెలతో నీరుపోస్తూ నానా ఇబ్బందులు పడుతున్న క్రమంలో తాజాగా కురిసిన వర్షం పంటలకు జీవం పోసినట్లయ్యింది. అలాగే వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో వారం నుంచి తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయిన జనాలకు ఉపశమనం కలిగింది.
మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం ఉమ్మడి జిల్లా అంతటా ర్యాలీలు, మానవహారాల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించారు. డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలను తెలియజేస్తూ పోలీసులు, అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నాయకులు ప్లకార్డులు ప్రదర్శించారు. ముఖ్యంగా యువతను పెడదోవ పట్టిస్తున్న మత్తు అనే మహమ్మారిని తరిమికొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రతిజ్ఞ చేశారు.
హనుమకొండ సబర్బన్, జూన్ 26 : ఎన్పీడీసీఎల్లో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటరల నియామక ప్రక్రియను త్వరలో నిర్వహించనున్నట్లు ఎన్పీడీసీఎల్ జాయింట్ సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్పీడీసీఎల్లో గత సంవత్సరం 04/06/2023న జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ వంద పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించారు. అయితే నియామక ప్రక్రియపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించగా పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. కాగా, కోర్టు ఉత్తర్వుల ప్రకారం మిగిలిన పోస్టుల భర్తీని తర్వలో నిర్వహిస్తామని ఎన్పీడీసీఎల్ యాజమాన్యం తెలిపింది.
గణపురం, జూన్ 26: చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో బుధవారం మొదటి దశ 500, రెండో దశ 600 మెగావాట్ల ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఒకేసా రి రెండు ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం ఇదే మొదటిసారి. ఒకరోజు విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతే సంస్థకు రూ.4 కోట్ల నష్టం వాటిల్లనుంది. మళ్లీ విద్యుత్ ఉత్పత్తి కొనసా గాలంటే రెండు, మూడు రోజులు పడుతుందని కేటీపీపీ అధికారులు తెలిపారు.