రాయపర్తి, సెప్టెంబర్ 23 : ఎలక్షన్ల సీజన్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రతిపక్ష పార్టీల నేతలు గడియకో తీరుగా ప్రజలను నమ్మించేందుకు జిమ్మిక్కులు చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలతో కలిసి పాలకుర్తిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయనను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్బంగా రాయపర్తి మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ అయిత ఉప్పలయ్య, ఎస్సీ కాలనీకి చెందిన అయిత శంకర్, మల్లయ్య, పీరని యాకయ్య, గౌరి సాయిలు తదితరులు మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులకు మంత్రి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రజల ఓట్లను కొల్లగొట్టాలన్న లక్ష్యంతో ప్రతిపక్ష పార్టీలు మాయమాటలు, మోసపూరిత హామీలతో వస్తున్నట్లు తెలిపారు. అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్న ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న బీఆర్ఎస్కే ప్రజలు మళ్లీ పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీలో చేరుతున్న కార్యకర్తలు, నాయకులందరినీ తాను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ బిల్ల సుధీర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, సర్పంచ్ గారె నర్సయ్య, ఎంపీటీసీ అయి త రాంచందర్, పార్టీ మండల ఉపాధ్యక్షుడు మహ్మద్ నయీం, ముద్రబోయిన సుధాకర్, పొగులకొండ వేణు, బెల్లం యాదగిరి పాల్గొన్నారు.
మండలంలోని జగన్నాథపల్లి, దుబ్బతండా గ్రామ పంచాయతీల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, పరిష్కరించాల్సిన సమస్యలపై ఇరు గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు గూడెల్లి శ్రీలతా శ్రీనివాస్, దేదావత్ కమలమ్మ వెంకన్న సారథ్యంలో బీఆర్ఎస్ మండల నాయకులతో కలిసి కార్యకర్తలు, ప్రజలు శనివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్బంగా గ్రామంలో నెలకొన్న సమస్యలు, కొత్తగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, అభివృద్ధి పనులపై చర్చించారు. ఇరు గ్రామాల ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు సమన్వయంతో పనుల నివేదికలు తయారు చేయించుకోవాలని మంత్రి సూచించారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు బద్దం రంగారెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, యాకయ్య పాల్గొన్నారు.
ఊకల్ పద్మశాలీల మద్దతు
మండలంలోని ఊకల్ గ్రామానికి చెందిన పద్మశాలీ కులస్తులు ఆ సంఘం ప్రతినిధి సారథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కలిసి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పద్మశాలి కులస్తులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అవసరమైన నిధులు, పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేయాలని కోరారు.