వర్ధన్నపేట, జూలై 23 : పార్టీ పురోగతి కోసం నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటదని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని ల్యాబర్తి గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన పలువురు ముఖ్య కార్యకర్తలు ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే రమేశ్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు. పార్టీ కోసం పనిచేసే క్రియాశీల కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండాలనే లక్ష్యంతో పార్టీ అధినేత కేసీఆర్ బీమా పాలసీని చేయించి ప్రీమియం పూర్తిస్థాయిలో పార్టీ చెల్లించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు అండగా ఉండేలా పార్టీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని అన్నారు. అంతేకాక ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాటాల ద్వారా సాధించిన తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటుగా రాష్ర్టాన్ని సంక్షేమ రంగంలో కూడా దేశంలో ముందంజలో ఉంచుతున్నారన్నారు. ప్రతి సంక్షేమ పథకం పారదర్శకంగా పేదలకు ఉపయోగపడేలా ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేస్తున్నారన్నారు. ప్రజలు కూడా కష్టపడి పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని రానున్న రోజుల్లో కూడా ఆదరించాలని ఎమ్మెల్యే రమేశ్ కోరారు. ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలో చేరిన బీఎస్పీ మండల ప్రధాన కార్యదర్శి సూరారపు నాగరాజు, కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యుడు కాకర్ల ఎల్లయ్య, బీజేపీ నాయకుడు బుర్ర వెంకన్నతో పాటు మూడు పార్టీలకు చెందిన సుమారు 50 మంది కార్యకర్తలకు ఎమ్మెల్యే రమేశ్ కండువాలు కప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మార్గం భిక్షపతి, ల్యాబర్తి సర్పంచ్ పస్తం రాజు, ఎంపీటీసీ అన్నమనేని ఉమాదేవి, ఆత్మ చైర్మన్ గోపాల్రావు, నాయకులు పాల్గొన్నారు.