హనుమకొండ, సెప్టెంబర్ 28: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2022లో అఖిలభారత స్థాయిలో 646వ ర్యాంక్ సాధించిన మంద అపూర్వ ప్రస్తుతం ముంబైలో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్అండ్ స్పోర్ట్స్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. ఉద్యోగం చేస్తూనే గ్రూప్-1లో ఘనవిజయం సాధించిన అపూర్వ తాజాగా డిప్యూటీ కలెక్టర్‌గా ఖమ్మం జిల్లాలో పోస్టింగ్‌కు ఎంపికయ్యారు. ముందుగా దేశ సేవ కోసం చేస్తున్న ప్రయత్నంలో ఉద్యోగం చేస్తూనే గ్రూప్-1 సాధించడాన్ని కష్టానికి తగిన ఫలితంగా ఆమె అభివర్ణించారు.
ఈ విజయానికి ఆమె తల్లిదండ్రులు, భర్త, కుటుంబ సభ్యుల సహకారమే ప్రధాన కారణమని అపూర్వ తెలిపారు. మంద అపూర్వ తండ్రి ప్రొఫెసర్ మంద అశోక్‌కుమార్ కాకతీయ విశ్వవిద్యాలయంలో పలు పదవుల్లో, పీజీ కళాశాల ప్రిన్సిపల్, అర్థశాస్త్ర విభాగాధిపతి, అర్థశాస్త్ర పాఠ్యప్రణాళిక చైర్మన్, అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా బాధ్యతలు నిర్వహించారు. తల్లి రజనీదేవి, భీమదేవరపల్లి మండలం, మాణిక్యాపూర్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా సేవలందిస్తున్నారు.
భర్త రఘుకార్తీక్ ప్రముఖ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అపూర్వకు పెద్ద అన్నయ్య అరుణ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. రెండో అన్నయ్య అభినవ్, పూణెలోని ప్రముఖ ఫార్మసీ సంస్థలో డైరెక్టర్‌గా ఉన్నారు. మంద అపూర్వ విజయంపై కేయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సహోద్యోగులు అభినందనలు తెలిపారు.