కాజీపేట, మే 13: కాజీపేట రైల్వే జంక్షన్ శివారులోని వడ్డేపల్లి చెరువు సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం వెలుగుచూసింది. కాజీపేట జీఆర్పీ సీఐ నరేష్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వడ్డేపల్లి చెరువు రైల్వే పంప్ హౌస్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే అధికారుల నుంచి సమాచారం వచ్చిందన్నారు. జీఆర్పీ సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడంతో తల, మొండెం రెండుముక్కలై వేర్వేరుగా పడి ఉన్నట్లు తెలిపారు.
మృతుడు సుమారు (45) ఏండ్ల వయస్సు, 5”5 ఎత్తు, చామన ఛాయ రంగు ఆకారం కలిగి ఉన్నాడన్నారు. మృతుని కడుపు కుడి పక్కల పుట్టు మచ్చ ఉందని, ఒంటి పై వంకాయ రంగు టీ షర్ట్, వంకాయ రంగు షాట్ ధరించి ఉన్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి మృత దేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించామని పేర్కొన్నారు. మృతునికి ఎవరైనా సంబంధికులు ఉంటే కాజీపేట జీఆర్పీ స్టేషన్, లేదా, 9247800433, 9948348070 సెల్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.