రాయపర్తి: వరంగల్ జిల్లాలోని రాయపర్తి (Rayaparthi) మండలంలో విషాదం చోటుచేసుకున్నది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు నీటిలో మునిగి చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం రాయపర్తి మండలంలోని మైలారం గ్రామానికి చెందిన బాల వెంకన్న (39) మరో నలుగురితో కలిసి తాళ్లకుంటలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. అయితే సాయంత్రం నలుగురు మత్స్యకారులు తిరిగి ఇంటికి చేరుకున్నారు. వెంకన్న రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు వారిని ఆరాతీశారు.
దీంతో మత్స్యకారులతోపాటు గ్రామస్తులు కుంటలో గాలించగా.. కాళ్లకు చేపల వల చుట్టుకొని ఉన్న స్థితిలో నీళ్లలో కనిపించాడు. దీంతో మృతదేహాన్ని బటయకు తీసి.. పోలీసులకు సమాచారం అందించారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా దవాఖానకు తరలించారు. చేపల వల కాళ్లకు తట్టుకోవడంతో నీట మునిగి చనిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, హోలీ పండుగపూత వెంకన్న అకాల మృతితో మైలారంలో విషాద చాయలు అలముకున్నాయి. మృతునికి భార్యతోపాటు ఇద్దరు కుమారులున్నారు.