ఖిలావరంగల్, ఏప్రిల్ 3 : మామునూరు విమానాశ్రయం విస్తరణ కోసం చేపట్టిన భూసేకరణకు అడ్డంకులు తొలగడం లేదు. భూమికి బదులు భూమి, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ప్రజాప్రతినిధులు, భూసేకరణ నిబంధనల ప్రకారం మాత్రమే పరిహారం అందజేస్తామని అధికారులు స్పష్టం చేస్తుండడంతో రైతులు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధీనంలో ప్రస్తుతం 696.14 ఎకరాల భూమి ఉంది. అయితే విమానాశ్రయం విస్తరణకు మరో 253 ఎకరాలు భూమి అవసరం కాగా, ఖిలావరంగల్ మండలంలోని గాడిపల్లి, గుంటూరుపల్లి గ్రామాల్లో 198 ఎకరాలు, నక్కలపల్లిలో 48 ఎకరాలు, ప్రభుత్వ భూమి 7 ఎకరాలకు రెవెన్యూ అధికారులు సర్వే చేసేందుకు వెళ్లగా రైతులు అడ్డుకున్నారు.
మార్కెట్ విలువ ప్రకారం ఎకరాకు రూ.2 నుంచి రూ.3 కోట్లు చెల్లించాల్సిందేనని రైతులు డిమాండ్ చేశారు. అలాగే శంభునిపేట నుంచి నక్కలపల్లి మీదుగా నెక్కొండకు వెళ్లే రహదారిని మూసి వేస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో స్పష్టమైన హామీ ఇస్తేనే తమ భూముల్లో అడుగు పెట్టాలన్నారు. దీంతో మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్‌తోపాటు అధికార యంత్రాంగం గుంటూరుపల్లి ముసలమ్మ చెట్టు వద్ద రైతులతో సమావేశం ఏర్పాటు చేసి భూమికి బదులు భూమి, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు సర్వేకు ఒప్పుకున్నారు.
దీంతో ఖిలావరంగల్ తహసీల్దార్ నాగేశ్వర్ పర్యవేక్షణలో సర్వే చేసి హద్దులను ఏర్పాటు చేశారు. అయితే, గురువారం వరంగల్ కలెక్టరేట్లో భూ నిర్వాసితులతో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, ఆర్డీవో సత్యపాల్‌రెడ్డి, ఖిలావరంగల్ తహసీల్దార్ నాగేశ్వరరావు చర్చలు జరిపారు. గాడిపల్లి, గుంటూరుపల్లి గ్రామాల్లో ఎకరానికి రూ.55 లక్షలు, నక్కలపల్లిలో రూ.60 లక్షలు పరిహారం చెల్లిస్తామని అధికారులు చెప్పడంతో గిట్టుబాటు కాదని రైతులు సమావేశం నుంచి బయటకు వచ్చారు. సర్వే చేపట్టిన నాటి నుంచి ఇప్పటికి 11 సార్లు కలెక్టరేట్‌కు అధికారులు పిలిపించారని, తమకు న్యాయం చేయకపోతే పెట్టిన హద్దులు తొలగిస్తామని రైతులు హెచ్చరించారు.
హామీలు విస్మరించిన ఎమ్మెల్యే, మంత్రి
విమానాశ్రయానికి భూములు ఇచ్చేది లేదని రైతులందరం సర్వేను అడ్డుకున్నం. గుంటూరుపల్లికి ఎమ్మెల్యే, మంత్రితోపాటు జిల్లా అధికారులు వచ్చి రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భూమికి బదులు భూమి ఇస్తామని, ఎవరికి కూడా నష్టం కలిగించమని హామీ ఇచ్చి ఇప్పుడు పూర్తిగా విస్మరించారు. శంభునిపేట, నక్కలపల్లి రోడ్డును పూర్తిగా మూసివేయడం వల్ల ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి. చిన్న, సన్నకారు రైతులు భూములు కోల్పోతే కుటుంబం రోడ్డున పడినట్లే.
– కోయ కమలాకర్, గుంటూరుపల్లి