ములుగు : జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనలను వ్యతిరేకంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, నోట్ పుస్తకాలు,టై బెల్ట్ లు అమ్ముతున్నారన్నారని, పుస్తకాల విక్రయం ఆపకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని ఏబీవీపీ ములుగు జిల్లా కన్వీనర్ మమన్ హెచ్చరించారు. స్టేషనరీ దుకాణాలను పాఠశాలలోనే ఏర్పాటు చేసి సరస్వతి నిలయాలను వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పాఠశాలల్లో చేర్పించిన విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్, షూ లాంటి వస్తువులన్నీ తప్పకుండా తమ పాఠశాల యాజమాన్యంకు సంబంధించిన వారి దగ్గరే కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులకు నిబంధనలు పెడుతున్నారని ఆరోపించారు.
అయితే బయట దుకాణాల ధరలకు ఈ పాఠశాలల్లోని ధరలకు తీవ్రవ్యత్యాసం ఉందన్నారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నా కూడా యాజమాన్యం వారి మాటలను పట్టించుకోవడం లేదన్నారు. ఈ సమస్యపై విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ఆయా పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి పుస్తకాలు విక్రయిస్తున్న గదులను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే జిల్లా విద్యాశాఖ అధికారి, కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయిరాం, రజినీకాంత్, జశ్వంత్, శ్రీతన్ తదితరులు పాల్గొన్నారు.