వర్ధన్నపేట/నల్లబెల్లి/నర్సంపేట/సంగెం, మే 2 : గన్నీ సంచుల కొరత, కొనుగోళ్లలో జాప్యంపై మక్క రైతులు భగ్గుమన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రోజుల తరబడి కొనుగోలు కేంద్రా ల్లో పడిగాపులు పడడంపై మండిపడ్డారు. కొన్నిచోట్ల కాంటాలైన బస్తాలను గోదాములకు తరలించపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జిల్లాలోని పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇ ల్లంద వద్ద జాతీయ రహదారిపై మాజీ ఎమ్మె ల్యే అరూరి ఆధ్వర్యంలో రైతులు, బీఆర్ఎస్ నా యకులు రాస్తారోకో చేపట్టారు.
పోలీసులు అక్కడకు చేరుకొని బలవంతంగా అరూరి రమేశ్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి రాస్తారోకోను విరమింపజేశారు. అంతకు ముందు ఆయన వర్ధన్నపేట పట్టణంలోని ఫిరంగిగడ్డలోని ధాన్యం, ఇల్లంద వ్యవసాయ మార్కె ట్ యార్డులోని మక్కల కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కాగా, నల్లబెల్లిలోని సొసైటీ కార్యాలయాన్ని రైతులు దిగ్బంధించారు. కాంటా పెట్టిన మక్కలను గోదాములకు తరలించలేదని, 20 రోజుల నుంచి అవస్థ పడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వాహనాలు సమకూర్చేందుకు సొసైటీ సిబ్బంది లంచం తీసుకుంటున్నారని ఆరోపించారు. పోలీసుల హామీతో ఆందోళన విరమించారు.
అలాగే సంగెం మండలం తీగరాజుపల్లి శివారులోని భాగ్యనగర్ వేబ్రిడ్జి వద్ద రైతులు రాస్తారోకో చేశారు. పర్వతగిరి మండలం చౌటపల్లి, ఏనుగల్లు సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు సంగెం, పర్వతగిరి మం డలాల్లోని పలు గ్రామాల నుంచి రైతులు మక్కలను తీసుకొచ్చి వేబ్రిడ్జి వద్ద కాంటా వేయించారు. అక్కడి నుంచి కొంకపాకలోని గోదాము కు వచ్చిన రైతులు హమాలీలు లేకపోవడంతో కొద్దిరోజులుగా రోడ్డుపైనే వాహనాలతో వేచి ఉన్నారు. శనివారం రాస్తారోకో చేయగా పోలీసులు హామీ ఇవ్వడంతో విరమించారు. నర్సంపేటలో మక్కల కొనుగోలు కేంద్రాలు పెంచాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురిజాల క్రాస్‌రోడ్డు వద్ద రైతులతో రాస్తారోకో నిర్వహించారు. నర్సంపేట డివిజన్లో 90 వేల ఎకరాలల్లో మక్కలు సాగు చేస్తే కేవలం ఏడు కేంద్రాలను ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ నాయకుడు తక్కళ్లపల్లి రవీందర్రావు మండిపడ్డారు.