రాయపర్తి, ఏప్రిల్ 25 : దేశానికి అన్నం పెడుతున్న రైతులను రేవంత్ సర్కార్ గోసపెడుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం ఆయన వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని తెలంగాణ క్రీడాప్రాంగణం ఆవరణలో జాంబవ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో మార్క్‌ఫెడ్ నిర్వహిస్తున్న మక్కల కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ మండల నాయకులతో కలిసి సందర్శించారు. కాంటా లు పెట్టడం లేదని, గన్నీ సంచులు అందించడం లేదని, కొనుగోలు చేసిన బస్తాలను కల్లాలోనే ఉంచడంతో తా ము రోజుల తరబడి కాపలాగా ఉండాల్సివస్తున్నదని రైతులు ఎర్రబెల్లితో వాపోయారు.
మక్క రైతుల కష్టాలు విని చలించిపోయిన ఎర్రబెల్లి కలెక్టర్ సత్యశారద, మార్క్‌ఫెడ్ డీఎంతో ఫోన్లో మాట్లాడారు. రైతుల కష్టాలను వివరించారు. వెంటనే మక్కల కొనుగోళ్లను వేగవంతం చేయాలని, రైతులకు అవసరమైన గన్నీ సంచు లు సరఫరా చేయాలని, కాంటాలు వేసిన మక్కలను గిడ్డంగులకు తరలించుకోవాలని సూచించారు. అనంతరం రైతుల విజ్ఞప్తి మేరకు మక్కల కొనుగోలు కేంద్రం వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై స్థానిక బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటమాడుతున్నదన్నారు. రైతు భరోసా, రైతుభీమా, పంటల కొనుగోళ్లు, సాగు జ లాల సరఫరా, యూరియా బస్తాల ని ల్వ, వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్‌ను అందజేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని విస్మరించి ఢిల్లీకి సంచులు మోయడంలోనే రేవంత్‌రెడ్డి బిజీగా మారారని ఎద్దేవా చేశారు. మక్క రైతులతోపాటు మండలంలోని అన్ని గ్రా మాల్లో వెంటనే ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులందరితో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడుతామని హెచ్చరించారు. కేసీఆర్ హయాంలో పదేళ్లపాటు రాష్ట్రంలోని రైతులందరూ పండుగ వాతావరణంలో వ్యవసాయం చేసుకున్నారని గుర్తు చేశారు. మక్క రైతులకు మార్కెట్లో కష్టాలు, కన్నీళ్లే తప్ప ఏం కనిపించడం లేదన్నారు.
రాస్తారోకోతో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి ప్రయాణికు లు, వాహనదారులు ఇబ్బందిపడుతుండడంతో స్థానిక ఎస్సై రాజేందర్ చేసిన విజ్ఞప్తి మేరకు ఆందోళనను విరమించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, మండల నాయకులు జినుగు అనిమిరెడ్డి, రంగు కుమార్, పూస మధు, గారె నర్సయ్య, లేతాకుల రంగారెడ్డి, కుందూరు రాం చంద్రారెడ్డి, అయిత రాంచందర్, బందెల బాలరాజు, వేణు, ఎలమంచ శ్రీనివాస్‌రెడ్డి, బద్దం వేణుగోపాల్‌రెడ్డి, అనంతుల కృష్ణారెడ్డి, గూడెల్లి శ్రీనివాస్, ముద్రబోయిన సుధాకర్, చందు రామ్, అయిత కుమార్, మహ్మద్ యాకూబ్‌పాషా, జీవన్, మధు, రవి, జంపి, దోకురు దేవేందర్, సోమేందర్ పాల్గొన్నారు.
మక్కలు, ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో
జఫర్‌గఢ్, ఏప్రిల్ 25 : మక్కలు, ధాన్యం కొనుగోలు చేయాలంటూ జఫర్‌గఢ్‌లో రైతులు శనివారం రాస్తారోకో చేపట్టారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా జఫర్‌గఢ్, వర్ధన్నపేట ప్రధాన రహదారిపై సుమారు గంట పాటు బైఠాయించి ఆందోళన చేశారు.ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకే మక్కల కొనుగోలు కేంద్రాన్ని జఫర్‌గఢ్‌లో ప్రారంభించిందని, రెం డు వారాలు గడుస్తున్నా ఇప్పటి వరకు గింజ కూడా కొన్న పాపాన పోలేదన్నారు. మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభమైందని ప్రచారం చేయడంతో తిమ్మాపూర్, హిమ్మత్‌నగర్, సాగరం, వడ్డెగూడెం, జఫర్గఢ్తోపాటు తదితర గ్రామాల రైతులు తమ పంటలను అమ్ముకునేందుకు ట్రాక్టర్లలో కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి కుప్పలు, కుప్పలుగా పోశారని అన్నారు.
ఒకవైపు వాతావరణం మార్పులు.., మరోవైపు పందులు, కోతుల బెడదతో రాత్రిపగలు కొనుగోలు కేంద్రం వద్దే కాపాలా ఉంటున్నట్లు తెలిపారు. తీవ్ర ఇబ్బంది పడుతున్నా తమను పట్టించుకునే వారు లేరని రాస్తారోకో చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితి ఇదే తీరున ఉన్నదని రైతులు తెలిపారు. రాస్తారోకోతో జఫర్‌గఢ్, వర్ధన్నపేట రహదారిపై సుమారు కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. పరిస్థితి తెలుసుకున్న ఎస్సై రామారావు రైతులకు నచ్చచెప్పి రాస్తారోకోను విరమింపజేశారు.