Viral News : దొంగలు దోచుకుపోతారనే భయంతో ఓ రైతు ఏడాది క్రితం రూ.5 లక్షలు (Five lakh Rupees) భూమిలో పాతిపెట్టాడు. అయితే ఎలాంటి గుర్తు పెట్టకపోవడంతో పాతిపెట్టిన ప్రదేశాన్ని మర్చిపోయాడు. ఏడాది కాలంగా ఆ డబ్బుల కోసం వెతుకుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆ డబ్బు (Money) బయటపడింది. ఎట్టకేలకు ఆశగా తీసి చూసిన రైతుకు నిరాశే ఎదురైంది. ఎందుకంటే ఆ డబ్బును చెదలు తినేశాయి. దాంతో దిక్కుతోచని స్థితిలో తలబాదుకోవడం రైతు వంతయ్యింది. రాజస్థాన్ (Rajasthan) లో ఈ ఘటన వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్లోని నెవాయి గ్రామానికి చెందిన రైతు మంగిలాల్ ఏడాది క్రితం తన భూమిలో కొంతభాగాన్ని రూ.5 లక్షలకు విక్రయించాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఆ వచ్చిన సొమ్మును జాగ్రత్తగా ఉంచాలని భావించి ఓ సంచిలో మూటకట్టి వ్యవసాయ భూమిలో పాతిపెట్టాడు. ఆ తర్వాత ఆ డబ్బు దాచిపెట్టిన స్థలం మర్చిపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. అదే విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పాడు. అందరూ కలిసి ఆరు ఎకరాల పొలంలో పలుచోట్ల తవ్వి చూశారు. అయినా డబ్బు దొరకలేదు.
అయితే ఇటీవల విత్తనాలు వేయడానికి పొలం దున్నుతున్న సమయంలో డబ్బు సంచి బయటపడింది. దాంతో మంగిలాల్ కుటుంబసభ్యులు ఆనందపడ్డారు. కానీ తీరా సంచి తెరిచిచూస్తే అందులోని నోట్లను చెదపురుగులు తినేశాయి. వాటిలో స్వల్పంగా దెబ్బతిన్న నోట్లను తీసుకొని ఆ కుటుంబం స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను సంప్రదించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే నోట్ల పరిస్థితి చూసి వాటిని తీసుకునేందుకు బ్యాంకు అధికారులు నిరాకరించడంతో వారు నిరాశతో వెనుదిరిగారు.