ఖిలావరంగల్, ఏప్రిల్ 11: మహాత్మా జ్యోతిబా ఫూలే అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేశారని ప్రధానోపాధ్యాయుడు నరేంద్ర స్వామి అన్నారు. శివనగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జ్యోతిబా ఫూలే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1873 సెప్టెంబరు 24న ఫూలే తన అనుచరులతో కలిసి దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేసి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పని చేశారని చెప్పారు.
సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫూలే ఒక చైతన్య దీపికల ముందున్నారని కొనియాడారు. ఆయన భార్య సావిత్రిబాయి ఫూలే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకురాలన్నారు. ఫూలే బాలికల కోసం మొదటి పాఠశాలను 1848లో పూణేలో ప్రారంభించారని తెలిపారు. అదేవిధంగా ఫూలే కేవలం అణిచివేతకు గురవుతున్న కులాల ప్రజల పక్షాన పోరాడటమే కాకుండా అగ్రవర్ణ వితంతువుల పునర్వివాహానికి గొప్ప కృషి చేశారని కొనియాడారు.
1873 లో గులాంగిరి, సేద్యగాని చర్మకోల అనే గ్రంథాల్ని రచించి దీనబంధు అనే పత్రికను స్థాపించారన్నారు. భావజాల ప్రచారాన్ని కార్యాచరణగా మార్చడానికి 1870 లో సార్వజనిక్ సభ, 1873 సెప్టెంబరు 24నసత్యశోధక సమాజం సంస్థ ను స్థాపించారని తెలిపారు. ఈ కార్యక్రమములో పాఠశాల ఉపాధ్యాయుల బృందం తిరుపతి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, దేవరాజు, అంజయ్య, నరేందర్, రంగాచారి, కవిత, సంపత్, సుజాత, సుహాసిని, స్వప్న, భవాని, ప్రకాష్, కిరణ్మయి, జ్యోత్స్న, సందీప్ తదితరులు పాల్గొన్నారు.