తొర్రూరు, అక్టోబర్ 17: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Govt) నిర్లక్ష్యం చాటిచెప్పే ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్న భోజనం నాణ్యత దారుణంగా ఉండటంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను ఎవరూ పట్టించుకోకపోవడం, అధికార యంత్రాంగం నిర్లక్ష్య వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో వండుతున్న మధ్యాహ్న భోజనం (Mid day Meals) తినరాని విధంగా ఉందని, అన్నం ఉడకకపోవడం, కూరల్లో నీళ్లు ఎక్కువగా ఉండడం, పప్పుకూరలో పప్పు తక్కువగా వేయడం, సాంబారు నీళ్ల తీరుగా తయారవుతోందని తెలిపారు. తాము చదవడానికి వస్తున్నామని, ఆకలితో కూర్చోడానికి కాదని మండిపడ్డారు. పాఠశాలలో బాత్రూములు దయనీయంగా ఉండడంతో విద్యార్థులు క్యూ లైన్లో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
శుభోదయం అన్న విద్యార్థులను ఉపాధ్యాయులు మొఖం మీద తిడుతూ అవమానకరంగా ప్రవర్తించడం, యూనిఫామ్ లేకుండా వచ్చిన విద్యార్థులను పోలీసులతో కొట్టిస్తానని ప్రధానోపాధ్యాయులు బెదిరించడం విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. రోజూ 400 మంది విద్యార్థుల్లో 100 మందికి పైగా గుడ్లు అందకపోవడం, సుమారు 80 గుడ్లు మాయం అవడం రోజువారీ వ్యవహారమైందని విద్యార్థులు ఆరోపించారు. ఫిర్యాదు చేసినా ప్రిన్సిపల్ పట్టించుకోకపోగా, తిరిగి తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ‘పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి (Yashaswini Reddy), మా బాధలు చూడండి.. కాంగ్రెస్ ప్రభుత్వం మా పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం పేరుతో మాటలు చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల ప్రాథమిక హక్కులను సైతం గాలికొదిలేసిందని స్థానికులు మండిపడుతున్నారు. పాఠశాలల్లో పిల్లలకు సరైన భోజనం కూడా అందించలేని ప్రభుత్వం ప్రజల సమస్యలు ఎలా పరిష్కరిస్తుందని ప్రశ్నించారు. తక్షణమే అధికారులు పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.