హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): నగరంలోని ఓ ప్రధాన సూపర్ మార్కెట్లో కొనుగోలు చేసిన బిస్కెట్లలో నాణ్యతాలోపంపై వినియోగదారుల ఫోరంలో కేసు వేసిన న్యాయవాదికి రూ.25వేల పరిహారం చెల్లించాలని రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఆదేశించింది. నగరానికి చెందిన శ్రీమతి సంధ్య యాదవ్ అనే న్యాయవాది 2019లో తన నాలుగేళ్ల కూతురు కోసం సనత్‌నగర్‌లోని ఓ ప్రధాన సూపర్ మార్కెట్లో ప్రముఖ బిస్కట్లను కొనుగోలు చేసింది. వాటిని తన కూతురుకు తినిపించే సమయంలో బిస్కెట్ మధ్యలో విదేశీకణం ప్లాస్టిక్ కవర్ ముక్క కలిసి ఉంది.
దీంతో ఆశ్యర్యపోయిన న్యాయవాది 2019 మార్చిలో సరదు బిస్కెట్ కంపెనీపై జిల్లా ఫోరంలో కేసు దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన జిల్లా ఫోరం బిస్కెట్లను నాణ్యత ప్రమాణాల కోసం ల్యాబ్‌కు పంపించింది. ఈ పరీక్ష ప్రయోగశాల బిస్కెట్లలో ప్లాస్టిక్ కణాలను గుర్తించినట్లు జిల్లా ఫోరం ప్రకటించింది. బిస్కెట్లలో ప్లాస్టిక్ కణాలు కలిసిపోవడం వల్ల వినియోగదారులు మానసిక వేదనకు గురికావడంతో పాటు వాటిని వినియోగించడం వల్ల జరిగిన నష్టానికి ప్రతిఫలంగా వినియోగదారులకు బిస్కెట్ కంపెనీ, సూపర్ మార్కెట్ సంయుక్తంగా రూ.25వేల పరిహారాన్ని చెల్లించాలని జిల్లా ఫోరం ప్రకటించింది.
కంపెనీ అప్పీల్‌ను కొట్టేసిన కమిషన్
జిల్లా ఫోరం ఆదేశాలను ఖైరతాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో బిస్కెట్ కంపెనీ అప్పీల్ చేసింది. నాలుగు సంవత్సరాల పాటు జరిగిన విచారణ, వాదనల అనంతరం 2026 ఫిబ్రవరి 25న బిస్కెట్ కంపెనీ అప్పీల్‌ను రాష్ట్ర వినియోగదారుల కమిషన్ తోసిపుచ్చింది. రాష్ట్ర ఫోరం తీర్పును సమర్ధించింది. దీంతో బిస్కెట్ కంపెనీ, సూపర్ మార్కెట్.. న్యాయవాది సంధ్యకు పెరిగిన వడ్డీతో కలిపి రూ.25వేలు చెల్లించాలని ఆదేశించింది.