తొర్రూరు : కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. తొర్రూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీపైన, సీఎం రేవంత్ రెడ్డిపైన విమర్శలు గుప్పించారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో శనివారం పట్టణంలోని 5వ వార్డులో రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ప్రచారానికి ముందు హనుమాన్ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలోనే తొర్రూరు మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రోకర్ మాటలు చెప్పి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ విషయంలో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. గిరిజనుల అభివృద్ధికి కేసీఆర్ విశేషంగా కృషి చేస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడీ బిడ్డల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.
మహిళలకు పంపిణీ చేస్తున్న ఇందిరమ్మ చీరల విషయంలో కమిషన్ల కక్కుర్తితో మహిళా సంఘాల పేరుతో సుమారు రూ.450 కోట్ల రుణాల్లో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుల పక్షాన నిలిచిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని, రైతుబంధు, రైతు భరోసా వంటి పథకాల ద్వారా రైతులకు అండగా నిలిచారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేయడంలో దేశంలోనే నెంబర్ వన్‌గా మారిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో పెన్షన్లను రూ.2,000 నుంచి రూ.4,000 చేస్తామని చెప్పి ఇప్పటివరకు అమలు చేయలేదని, ఒక్కో వృద్ధుడిపై సుమారు రూ.60 వేల బాకీలు ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్న హామీ అమలు కాలేదని, రైతుబంధు, రైతు బోనస్ ఎగ్గొట్టారని ఆరోపించారు.
వివాహాల సందర్భంగా కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తామన్న హామీ కూడా గాలికొదిలేశారని మాజీ మంత్రి ఎద్దేవాచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ మేనిఫెస్టోలో లేని ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల మన్ననలు పొందారని తెలిపారు. తొర్రూరు పట్టణంలో సెంట్రల్ లైటింగ్, పాల కేంద్రం వంటి అభివృద్ధి పనులు మంజూరై ఉన్నా ఇప్పటివరకు ప్రారంభించలేదని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఓటు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను వారి దొంగ హామీలపై నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ, ముఖ్యంగా 5వ వార్డులో పార్టీ అభ్యర్థి మచ్చా సురేష్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి బీఆర్ఎస్ నాయకులు, సీనియర్ కార్యకర్తలు, యువ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణంలో ఇంటింటి ప్రచారం ఉత్సాహంగా కొనసాగింది. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి.