నర్సింహులపేట ఫిబ్రవరి 12 : అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతూ అక్రమార్కలను పరుగులు పెట్టిస్తున్నారు. నర్సింహులపేట (Narsimhulapeta) మండలంలోని రామన్నగూడెం, కౌసల్య దేవిపల్లి, ఫకీత తండా, బొజ్జన్నపేట, కొమ్ములవంచ గ్రామంలోని ఆకేరు వాగు నుంచి.. అనుమతులు లేకుండా కొంతమంది ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ స్వయంగా రంగంలోకి దిగారు. మంగళవారం ఇసుక రవాణా చేస్తున్న ర్యాంపులను( Sand ramps) తనిఖీ చేశారు. వాగుల్లోకి దిగి ఇసుక ర్యాంపులను పరిశీలించారు.
ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు ఎస్ఐ సురేశ్ మాట్లాడుతూ..మండలంలో ఇసుకను అక్రమంగా (Illegal sand) రవాణా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుకకు అనుమతులు లేకుండా పట్టుబడితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఆదేశాల మేరకు నర్సింహులపేట మండలంలో అక్రమ ఇసుక రవాణాకు అడ్డకట్ట వేసేందుకు విస్తృతంగా తనిఖీలు చేపడుతామన్నారు.