తొర్రూరు, అక్టోబర్ 21: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు (Thorrur) మండల పరిధిలో రాత్రివేళల్లో లారీల డ్రైవర్ల నిర్లక్ష్యంతో జరిగే ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిద్రమత్తులో వాహనాలు నడపడం వల్ల రోడ్లపై ప్రమాదాలు పునరావృతమవుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. పట్టణ కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున సుమారు 4.30 గంటల సమయంలో బస్టాండ్ సమీపంలోని సిగ్నల్ వద్ద ఒక గ్రానైట్ లారీ అదుపు తప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి లారీ క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జయింది. దీంతో డ్రైవర్, క్లీనర్‌కు తీవ్ర గాయాలు కాగా, వారిని స్థానికులు ఖమ్మంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
సమాచారం అందుకున్న తొర్రూరు తొర్రూరు సీఐ తౌటం గణేష్, ఎస్ఐలు గొల్లమూడి ఉపేందర్, శివరామకృష్ణ తమ సిబ్బందితో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్ర మత్తే కారణమా లేదా వాహనంలో సాంకేతిక లోపమా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా ఇటీవల మండలంలోని ఫతేపురం గ్రామ శివారులో నిద్రమత్తులో డ్రైవర్ కోళ్ల వ్యాన్‌ను రాంగ్ డైరెక్షన్లో నడపడంతో కోళ్ల వ్యాను బోల్తాపడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. దీంతోపాటు సోమవారం దీపావళి పండుగ రోజు కూడా తొర్రూరు పట్టణంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద మరో లారీ డివైడర్‌ను ఢీకొట్టిన సంఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ఆ ఘటనలో ఎవరూ గాయపడలేదు. నిద్రమత్తులో వాహనాలను నడపడం ప్రాణాలకు ముప్పు తెస్తుందని, ప్రభుత్వం ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద వాహనాలను నడపే డ్రైవర్లకు విశ్రాంతి సమయాలు, మానసిక అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని వారు కోరుతున్నారు. పోలీసులు కూడా డ్రైవర్లపై కఠినంగా వ్యవహరించి, రాత్రివేళల్లో వాహనాల నియంత్రణకు ప్రత్యేక పహారా వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్థానికులు సూచిస్తున్నారు.