కురవి : ఆ బాలిక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదివేందుకు మరో రెండు రోజుల్లో కాలేజీలో చేరాల్సి ఉంది. అందుకే కళ్లద్దాలు, కొత్త దుస్తులు కొనుక్కోవడానికి తల్లితో కలిసి మానుకోటకు వెళ్లింది. అద్దాలు, దుస్తులు కొనుక్కుని తిరిగి ఆటోలో తిరిగి వస్తుండగా.. మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చింది. ఆటోను లారీ ఢీకొట్టడంతో కన్నతల్లి కండ్ల ముంగటే కుమార్తె దుర్మరణం పాలైంది. కురవి శివారులోని లింగ్యా తండా సమీపంలోగల 365 జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కురవికి చెందిన తొడుసు నేహా (15) ఇటీవలే నెల్లికుదురులోని సోషల్ వెల్ఫేర్ గురుకులంలో 10వ తరగతి 560 మార్కులతో ఉత్తీర్ణురాలైంది. మరో రెండు రోజుల్లో కాలేజీలో చేరాల్సి ఉంది. ఈ క్రమంలో కళ్లద్దాలు, దుస్తులు కొనుక్కోవడానికి నేహా తన తల్లి సరితతో కలిసి మహబూబాబాద్‌కు వెళ్లింది. కళ్లద్దాలు, కొత్త దుస్తులు కొనుక్కుని కురవికి రావడానికి మహబూబాబాద్‌లోని ఆటో అడ్డా వద్ద కురవికి చెందిన ఆటో ఎక్కారు.
మహబూబాబాద్ నుంచి కురవికి తిరిగి వస్తుండగా కురవి శివారులో లింగ్యా తండా గ్రామ సమీపంలో మరిపెడ నుంచి మహబూబాబాద్‌కు వెళ్తున్న టీఎస్ -26 టీ 9152 నంబర్ గల అశోక్ లేలాండ్ వాహనం మృత్యువు రూపంలో దూసుకొచ్చింది. ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తొడుసు నేహా (15 ) అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి తల్లి తొడుసు సరితకు, ఆటో డ్రైవర్ కానుగంటి రాజుకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కురవి మండలం రాజోలు గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ నెమలి వంశీని పట్టుకున్నారు. క్షతగాత్రులు మహబూబాబాద్ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతురాలి తల్లి తొడుసు సరిత పరిస్థితి విషమంగా ఉంది. కూతురు మృతి వార్త తెలుసుకున్న నేహా తండ్రి వెంకన్న ప్రమాద స్థలంలో కుమార్తె మృతదేహంపై పడి ‘నేహా నీకు అప్పుడే నూరేళ్లు నిండాయా..’ అని రోదించడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది.