నెల్లికుదురు, డిసెంబర్ 23: ‘నాపై నమ్మకంతో రెండుసార్లు గెలిపించారు.. మీ రుణం తీర్చుకోవడానికి నియోజకవర్గ పెద్ద జీతగానిలా ఉంటా.., నాకు రెండు లక్షల మంది యజమానులున్నారు.., మీ సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి మీ ఇంటికే వచ్చా’ అని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. ‘మన ఊరు – మన ఎమ్మెల్యే’ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన మండలంలోని నర్సింహులగూడెం, కాస్యతండా, బంజర, శ్రీరామగిరి, మునిగలవీడు గ్రామాల్లో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలుకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించిన ఎమ్మెల్యే, మరికొన్నింటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. సమస్యలు తెలుసుకుని సత్వరం పరిష్కరించేందుకే ‘మన ఊరు- మన ఎమ్మెల్యే’ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గవ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు తెలిపారు. 25 ప్రభుత్వ శాఖల అధికారులతో మీ ఇళ్ల వద్దకే వచ్చి సమస్యలు పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు వస్తాయని, అర్హులు అందోళన చెందొద్దన్నారు. రైతుల అభ్యర్థన మేరకు కాస్యతండాలో ఎస్సారెస్పీ కాల్వపై బ్రిడ్జి నిర్మాణం కోసం అక్కడికక్కడే రూ.2లక్షలు మంజూరు చేసి, రెండు నెలల్లోనే పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.
తండాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మిస్తానని హమీ ఇచ్చారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్నదని , ప్రజలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. అనంతరం శ్రీరామగిరి గ్రామంలో రూ.27 లక్షలతో నిర్మించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదామును ప్రారంభించారు. అదేగ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సంద శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతుండగా, అతడిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ బాలాజీ నాయక్, మండల కో ఆర్డినేటర్ కాసం వెంకటేశ్వర్‌రెడ్డి, తొర్రూరు ఏఎంసీ వైస్ చైర్మన్ విజయ్‌యాదవ్, సర్పంచ్‌లు ఎల్తూరి ఉప్పలయ్య, లక్ష్మి, నల్లాని నవీన్‌రావు, సొసైటీ చైర్మన్ గుండా వెంకన్న, మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి భిక్షపతి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రమేశ్, మండల అధికారి ప్రతినిధి వినోద్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు అనిల్, శ్రీశైలం పాల్గొన్నారు.
క్రిస్టియన్లకు గిఫ్ట్‌ప్యాక్‌ల పంపిణీ
ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను పూజిస్తే, దేవుడిని పూజించినట్లేనని ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అన్నారు. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని గురువారం ఆయన నెల్లికుదురు మండలంలోని చిన్ననాగారం చర్చిలో, కేసముద్రం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో క్రిస్టియన్లకు గిఫ్ట్‌ప్యాక్‌లు పంపిణీ చేసి మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నెల్లికుదురులో జడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, రైతుబంధు జిల్లా కో-ఆర్డినేటర్ భూక్యా బాలాజీ నాయక్, మండల కో-ఆర్డినేటర్ కాసం వెంకటేశ్వర్ రెడ్డి, తొర్రూరు ఏఎంసీ వైస్ చైర్మెన్ కసరబోయిన విజయ్ యాదవ్, పాస్టర్లు, కేసముద్రంలో ఎంపీపీ ఓలం చంద్రమోహన్, జడ్పీటీసీ రావుల శ్రీనాథ్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణరావు, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ప్రవీణ్‌కుమార్, మండల అధ్యక్ష,కార్యదర్వులు నజీర్ అహ్మద్, కముటం శ్రీనివాస్, సర్పంచ్ ప్రభాకర్, వైస్ ఎంపీపీ నవీన్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు యాకూబ్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెంకన్న, తహసీల్దార్ కోమల, ఎంపీడీవో రోజారాణి, నాయకులు వెంకన్న, వీరూనాయక్, రవీందర్‌రెడ్డి, అన్నెపాక వెంకన్న, వీరస్వామి, సుధాకర్, కుమారస్వామి, కిరణ్, సాయి పాల్గొన్నారు.