మరిపెడ: గతేడాది కురిసిన భారీ వానలకు ఆకేరు వాగె బ్రిడ్జి (Akeru Vagu Bridge) కొట్టుకుపోయింది. ఇప్పటికీ బ్రిడ్జిని నిర్మించకపోవడంతో సుమారు ఏడాదిగా చెక్‌డ్యామ్ మీదుగానే ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల మధ్య రాకపోకలు సాగించేందుకు 2017లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరిపెడ మండలంలోని బాల్నిధర్మారం శివారులో ఆకేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. అయితే గత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు ఆకేరు వాగులో వరద పోటెత్తడంతో బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో అప్పటి నుంచి చెక్‌డ్యామ్ మీదుగానే వాహనదారులు ప్రయాణం సాగిస్తున్నారు. కాగా, ఆ మార్గం గుండా రాకపోకలు కొనసాగించాలంటే కష్టాలు తప్పడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వ్యవసాయ పనులకు వెళుతున్న రైతులు వాగు దాటాలంటే చెక్ డామే ఆధారమైంది. బ్రిడ్జి నిర్మాణం చేపట్టకముందు నిర్మించిన చెక్‌డ్యామ్‌పై నుంచి రాకపోకల కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.
ఆనవాళ్లు లేకుండా పోయిన బ్రిడ్జి
గత సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకు ఆకేరు వాగు పరివారక ప్రాంతాలలోని చెరువులు తెగిపోవడంతో ఆయా చెరువుల నీరంతా ఆకేరువాగులోకి రావడంతో వరద ప్రవాహానికి బాల్నిధర్మారం గ్రామ శివారులోని రెండు జిల్లాలను కలిపే బ్రిడ్జి ఆడవాళ్లు లేకుండా కొట్టుకుపోయింది. వరద ప్రవాహం కు బ్రిడ్జి శిథిలాలు సుమారు 600 మీటర్ల దూరం కొట్టుకపోవడం జరిగింది. బ్రిడ్జి నిర్మాణం కోసం ఏర్పాటుచేసిన భారీ పిల్లర్లలోని 11 పిల్లర్లు పూర్తిగా ఒకవైపు ఒరిగి పోవడంతో వరద ప్రవాహం ఏ మేర ఉందో అర్థమవుతుంది.
బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి
ఆకేరు వాగు పరివాహక ప్రాంతాల గ్రామ ప్రజలు నిత్యవసరాల కోసం ఖమ్మం, మహబూబాబాద్ జిల్లా కేంద్రాలకు తరలి వెళుతుంటారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో భారీ వర్షాలు కురిస్తే వాగు ఉధృతంగా ప్రవహిస్తే వాగు దాటడం కష్టంగా మారుతుంది. ఎందుకంటే వ్యవసాయ భూములు ఆకేరు వాగుకు ఇరువైపులా ఉండడంతో రాకపోకలు సాగించేందుకు తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.