తొర్రూరు : ఎన్నికల సమయంలో పేద విద్యార్థులకు సాల్కర్షిప్లు ఇస్తామని హామీ ఇచ్చి గెలిచిన ఎమ్మెల్యేగా గెలిచిన యశస్వినీరెడ్డితో పాటు పాలకుర్తి కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీరెడ్డి ఆ హామీలను మరిచిపోయారని విద్యార్థుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పాలకుర్తి నియోజకవర్గంలో దాదాపు పది నుంచి పదిహేను మంది విద్యార్థుల చదువుల కోసం సహాయం చేస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. ఝాన్సీరెడ్డిని నమ్ముకొని విద్యార్థులు అప్పులు తీసుకువచ్చి పిల్లలను చదివిస్తున్నారు. కానీ, రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని ఆరోపిస్తున్నారు.
తొర్రూరు మండలానికి చెందిన ధర్మారపు వాణిశ్రీ అనే విద్యార్థిని ఐఐటీ సీటు మండిలో సాధించిన విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి, ఝాన్సీరెడ్డి వచ్చి అభినందించారు. ‘వాణిశ్రీ చదువుకు రూ.4లక్షల సాయం చేస్తాం’ హామీ ఇస్తామంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. కానీ, ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదని వాణిశ్రీ తల్లిదండ్రులు వాపోయారు. ప్రచారం కోసమే చేసే మాటలేనా..? పేద విద్యార్థులకు ఆశ చూపించి వంచించడం తగదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాటను నేతలు నెరవేర్చాలని లేదంటే.. ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకొని సాల్కర్షిప్లు అందజేయాలని బాధితులు కోరుతున్నారు.
విద్యార్థిని వాణిశ్రీ
2023లో ఐఐటీ మండిలో సీట్ రావడం జరిగింది. వెంటనే మేం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిశాం. మాకు రూ.లక్ష సాయం చేశారు. తర్వాత ఝాన్సీరెడ్డి రాయపర్తిలో ఒక విద్యార్థినితో ఫొటోలు దిగి నా పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. అయితే, ఇదేంటని ప్రశ్నించగా నాకు ఐఐటీ చదువు కోసం రూ.8 లక్షల సాయం చేస్తానని మాట ఇచ్చారు. తర్వాత అనేకసార్లు తిరగడంతో రూ.4లక్షలు భరించాలని.. రూ.4లక్షలు తాను ఇస్తానని మాట ఇచ్చారు. అనంతరం నాయకులతో వ్యక్తిగత సహాయకులతో సమాచారం చాలాసార్లు ఇవ్వగా రెండు సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. ఇప్పటికైనా ఝాన్సీరెడ్డి స్పందించి సహాయం చేయాలి.
– ధర్మారపు వాణిశ్రీ, విద్యార్థిని
ఎన్ఐటీ మేఘాలయలో సీటు సంపాదించుకున్న తర్వాత ఝాన్సీరెడ్డి పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ద్వారా సాయం చేస్తుందని తెలుసుకున్న మా నాన్న భారత దేవేందర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఝాన్సీ రెడ్డి దగ్గరికి కొన్నిసార్లు తిరగడంతో ఒక సెమిస్టర్ వరకు సాయం చేస్తానని మాట ఇచ్చింది. కానీ, నా ఎన్ఐటీ చదువు రెండు సంవత్సరాల్లో నాలుగు సెమిస్టర్లు మొత్తం పూర్తయిపోయింది. ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులను ఝాన్సీరెడ్డి వద్దకు తిప్పడానికి సుమారుగా మాకు రూ.10వేల రూ.5వేల ఖర్చు వచ్చింది. మా నాన్న ఝాన్సీరెడ్డి స్కాలర్షిప్ ద్వారా సహాయం చేస్తుందన్న భరోసాతో ఇప్పటివరకు నా చదువుకు రూ.2.50లక్షల అప్పు తెచ్చి పెట్టాడు. అయినా, ఇప్పటివరకు రూపాయి ఇవ్వలేదు.
– భారత లిఖిత, ఎన్ఐటీ విద్యార్థిని, వల్మీడి గ్రామం