బయ్యారం : బయ్యారం మండలం నామలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు అధికారులు వెనక్కి తీసుకోవడంతో లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది. గత నెల 26న జీపీ పరిధిలోని ధర్మపురం రాయకుండా నామలపాడు గ్రామాల్లోని 114 మంది ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అధికారులు అందజేశారు. పది రోజులు గడవక ముందే గ్రామపంచాయతీ సిబ్బంది ఇల్లిల్లూ తిరుగుతూ ఇచ్చిన మంజూరు పత్రాలను వెనక్కు తీసుకున్నారు. ఎందుకు తీసుకుంటున్నారో తెలియక లబ్ధిదారులు ఆందోళన చెందుతుంన్నారు. తీసుకునేందుకు వచ్చిన సిబ్బందిని ఎందుకు తీసుకుంటున్నారు అని ప్రశ్నించగా సమాధానం చెప్పడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. మళ్లీ ఇస్తారా ఇవ్వరా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరగకపోవడంతో అనర్హులకు ఇండ్లు మంజూరు అవ్వడంతోనే అధికారులు వెనక్కు తీసుకుంటున్నారని సమాచారం. ఈ విషయంపై అధికారులను వివరణ కోరగా రిజిస్టర్లో సంతకాల కోసం తీసుకుంటున్నామని కొందరు, పత్రాలు తీసుకుంటున్నట్లు తమకుసమాచారం లేదని కొందరు పొంతన లేని సమాధానం చెప్పడం గమనార్హం.