మరిపెడ, ఆగస్టు 3: అన్ని అర్హతలున్నా తనకు ఇందిరమ్మ ఇల్లు (Indiramma Illu) రాకపోవడంతో సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి నిరసన వ్యక్తం చేశారు. మరిపెడ మండలంలోని తానంచర్ల గ్రామానికి చెందిన బాసనపల్లి రాములు అర్హుల జాబితాలో తన పేరులేదని, తనకు ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సెల్ టవర్ ఎక్కారు. దీంతో గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేరు వచ్చిందని, 11వ నంబర్ అని ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు తనకు చెప్పారన్నారు. దీంతో ఇల్లు నిర్మించుకోవడానికి ప్రయత్నాలు చేపట్టే క్రమంలో మొదటి జాబితాలో పేరు లేదని చెబుతున్నారన్నారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కమిటీ సభ్యులు మాటా దాటవేస్తున్నారని, దీంతో తీవ్ర నిరాశకు గురయ్యానని చెప్పారు. గత్యంతరం లేక గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపిన్నట్లు వెల్లడించారు.
విషయం తెలుసుకున్న స్థానికులు సెల్ టవర్ దిగాలని, ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చూస్తామని తెలిపినప్పటికీ రాములు సెల్ టవర్ పైనుంచి దిగకపోవడంతో గ్రామంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితునికి హామీ ఇచ్చినప్పటికీ.. అతడు కిందికి దిగకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే రాంచంద్రనాయక్కు విషయం తెలియజేశారు. దీంతో ఇల్లు వచ్చే విధంగా చూస్తానని బాధితుని భార్యకు ఫోన్లో ఆయన హామీ ఇవ్వడంతో రాములు సెల్ టవర్ దిగారు.
గందరగోళం సృష్టిస్తున్న ఇందిరమ్మ కమిటీ సభ్యులు..
నిరు పేదలకు సొంతింటి కలను నిజం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇండ్ల విషయంలో లబ్ధిదారులను ఇందిరమ్మ కమిటీ సభ్యులు అయోమయానికి గురి చేస్తున్నారు. తానంచర్ల గ్రామంలో లబ్ధిదారులు ఎంత మందనే విషయం ఇప్పటివరకు చెప్పడం లేదు. మీకు ఇల్లు వచ్చిందని చెప్పడమే తప్ప స్పష్టత లేకపోవడంతో లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిజమైన లబ్ధిదారులకు సమాచారం అందించాలని కోరుకుంటున్నారు.