బయ్యారం, జనవరి 28 : రాష్ట్ర విభజన చట్టంలోని హామీ మేరకు ఉక్కు పరిశ్ర మ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని, బయ్యారంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటననకు నిరసనగా మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. ఈ సందర్భంగా బయ్యారం సొసైటీ చైర్మన్ మూల మధుకర్‌రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో నాడు తెలంగాణ రాష్ట్రసాధనతోపాటు బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం ఉద్యమాలు జరిగాయని తెలిపారు. ఉద్యమాలకు తలొగ్గిన కేంద్రం రాష్ట్ర విభజన సమయంలో ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామ ని హామీ ఇచ్చిందన్నారు. ఏడేళ్లు గడుస్తున్నా ఉక్కుపరిశ్రమ ఊసెత్తకపోవడం శోచనీయమన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఐటీ మంత్రి కేటీఆర్ పలుమార్లు ప్రధానితోపాటు కేంద్ర గనుల శా ఖ మంత్రికి విన్నవించుకున్నా ఎలాంటి చలనం లేదని తెలిపారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయకపోవడం వల్లే బయ్యారంలో నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారి చావుకు బీజేపీ ప్రభుత్వమే కారణమన్నారు.
ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయలేని బీజేపీ నాయకులకు బయ్యారంలో అగుడుపెట్టే అర్హత లేదన్నారు. పరిశ్రమ నిర్మాణం విషయంలో కాలయాపన చేయడం వల్ల నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటుంటే పరామర్శలు చేస్తూ శవ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఫిబ్రవరిలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ధర్నా నిర్వహిస్తున్న టీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి గార్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో నాయుకులు ఎంపీటీసీ సోమేశ్, నాయకులు శ్రీకాంత్‌నాయక్, వెంకటపతి, ప్రవీణ్ నాయక్, మంగీలాల్, సుమన్, కిరణ్‌రెడ్డి, శ్రీను, రాకేశ్ పాల్గొన్నారు.
బయ్యారం, ఉప్పలపాడు గ్రామాల్లో పర్యటిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు నిరసన సెగ తగిలింది. బయ్యారంలో టీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో చేయగా, ఉప్పలపాడు గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీనర్సింహాపురంలో టీఆర్ఎస్ కార్యకర్తలు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. ఈటల గోబ్యాక్ .. మోదీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించే వరకు బీజేపీ శ్రేణులను అడుగు పెట్టనీయమన్నారు. ఉక్కు పరిశ్రమ విషయంలో కాలయాపన చేయడం వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. రెండు గంటల పాటు ట్యాంక్‌పై నిరసన తెలిపారు. పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో వీరభద్రం, రమణయ్య, రవి పాల్గొన్నారు.