మహబూబాబాద్, జనవరి 28 : దళితుల బతుకుల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. శుక్రవారం మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో దళితబంధు అమలుపై కలెక్టర్ శశాంక అధ్యక్షతన ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు, ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దళితబంధును అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం సీఎం కేసీఆర్ మానసపత్రికగా మంత్రి అభివర్ణించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. అర్హులైన ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు వర్తించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మార్చి నెలలో అర్హులకు పథకం వర్తించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. కోళ్ల ఫారాలు, పాలు, గేదెలు లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గతంలో పాడి గేదెలు ఇచ్చిన కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందారనే కోణంలో అధికారులు పరిశీలించాలన్నారు. పథకంపై దళితులకు అవగాహన కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తక్కువ సమయం ఉన్నందున అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అర్హులను ఎంపిక చేసేందుకు కసరత్తు చేయాలన్నారు. సమావేశంలో దళితబంధు స్పెషల్ ఆఫీసర్ సన్యాసయ్య, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్, జిల్లా ఇతర అధికారులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాల అందజేత
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న గిరిజన భవన్లో దివ్యాంగులకు రూ.89 లక్షల విలువైన ఉచిత సహాయ ఉపకరణాలను మంత్రి సత్యవతి అందజేశారు. రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి సమక్షంలో 27 బ్యాటరీతో నడిచే ద్విచక్ర వాహనాలు, 7 బ్యాటరీతో నడిచే వీల్ చైర్లు, 8 ట్రైసైకిళ్లు, 10 డెఫ్ అండ్డెమ్ ఉన్న 10 మందికి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లతో పాటు ముగ్గురికి ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేశారు.