కురవి, డిసెంబర్ 23: కరోనా బారిన పడి తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, విద్యార్థినేత దబ్బెట మహేశ్ మృతి చెందాడు. వైరస్ సోకి కోలుకున్న తర్వాత నెల రోజులపాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన దబ్బేటి మహేశ్(36) కాకతీయ యూనివర్సిటీ పీజీ కళాశాల, సుబేదారిలో పార్ట్‌టైం అధ్యాపకుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. నెలరోజుల క్రితం కరోనా సోకడంతో మహబూబాబాద్‌లోని ఓ దవాఖానలో చికిత్స తీసుకుంటూ వైద్యుల సలహా మేరకు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడికి భార్య రోహిణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. మహేశ్ మృతదేహాన్ని యూనివర్సిటీ ప్రొఫెసర్లు దినేశ్‌కుమార్, రామచంద్రం, జేఏసీ నాయకులు సాదు రాజేశ్, దుర్గం సారయ్య, విజయ్‌ఖన్నా, స్టాలిన్, విజయ్, పృథ్వీ, మోహన్‌రాజ్, సోమలింగం, నర్సింహారావు, శ్రీధర్, నివాస్, దేవోజీ సందర్శించి నివాళులర్పించారు.
మిన్నంటిన రోదనలు
కురవి మండల కేంద్రానికి చెందిన దబ్బేటి సీతయ్యకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మహేశ్, చిన్న కుమారుడు శ్రీను. శ్రీను మూడేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందాడు. చేతికి అందివచ్చిన కొడుకులు కండ్లముందే మరణించడంతో తల్లి రోదనలు అక్కడ ఉన్నవారిని కదిలించాయి.