పెద్దవంగర(తొర్రూరు), మే 6: దళితబంధు పథకం ఉద్యమ తరహాలో అమలవుతున్నదని, ఇది ప్రపంచ దేశాలకు ఆదర్శమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం మండలంలోని పోలెపల్లిలో రూ.16లక్షలతో గ్రామ పంచాయతీ భవనం, రూ.20లక్షలతో నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థకు ప్రారంభోత్సవం చేశారు. రూ.4.56కోట్లతో పోలెపల్లి నుంచి చంద్రుతండా వరకు చేపట్టే బీటీ రోడ్డు, రూ.60లక్షలతో తాన్యతండాకు బీటీ రోడ్డు, రూ.15లక్షలతో ‘మన ఊరు-మనబడి’ పనులకు శంకుస్థాపన చేశారు. ఎస్వీకే తండాలో రూ.20లక్షలతో నిర్మించిన జీపీ భవనం, రూ.40లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు, రూ.30లక్షలతో చేపట్టిన డ్రైనేజీని ప్రారంభించారు.
మడిపల్లిలో రూ.2.16కోట్లతో నిర్మించిన 20 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. రూ.80లక్షలతో సీసీ రోడ్లు, రూ.40లక్షలతో నిర్మించిన డ్రైనేజీ, రూ.16లక్షలతో నిర్మాణం పూర్తయిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం, రూ.4.53కోట్లతో పీఎంజీఎస్‌వై రోడ్డు, రూ.60లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డు, రూ.4.40లక్షలతో చేపట్టనున్న మన ఊరు-మన బడి కార్యక్రమ పనులు, రూ.6లక్షల నిధులతో టాయిలెట్స్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఖానాపురం గ్రామానికి చెందిన నలుగురు దళితబంధు లబ్ధిదారులకు తొర్రూరు డివిజన్ కేంద్రంలో ట్రాక్టర్లు అందజేశారు. ఆయా గ్రామాల్లో కోలాట బృందాలు, డప్పుచ్చప్పుళ్ల నడుమ మహిళలు మంత్రి దయాకర్‌రావుకు తిలకందిద్ది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.
రాష్ట్రంలో అన్నివర్గాలకు దళితబంధు తరహాలో పథకాలను అందించే యోచనలో సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారని తెలిపారు. దళిత బంధు పథకం కోసం ఏటా రూ.25వేల కోట్లు కేటాయిస్తారని చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో గ్రామాల అభివృద్ధికి ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎన్నో అవార్డులను రాష్ర్టానికి అందించిందన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ఆసరా, రైతుబంధు, బీమా, ఉచిత కరంటు వంటి సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగలేదన్నారు. రాష్ట్రంలోని అన్ని పండుగలకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిన గొప్ప మహనీయుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం కిరికిరి
రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు చేపడుతుంటే, కేంద్రంలోని బీజేపోళ్లు కిరికిరి పెడుతున్నారని మంత్రి దయాకర్‌రావు విమర్శించారు. కరోనా కష్టకాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసిందన్నారు. యాసంగిలో కొనుగోలు చేయాలని ఢిల్లో ధర్నా చేసినా కేంద్రానికి పట్టింపులేదని, సీఎం కేసీఆర్ ధాన్యం కేంద్రాలను ప్రారంభించి కొనుగోలు చేస్తున్నట్లు గుర్తుచేశారు. కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆగలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండా, రాష్ట్రంలో చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిన్న అంజయ్య, జడ్పీటీసీ శ్రీనివాస్, తొర్రూరు మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సీతారాములు, పీఏసీఎస్ చైర్మన్ హరిప్రసాద్, తహసీల్దార్ రాఘవరెడ్డి, ఆర్‌డబ్ల్యూస్ ఈఈ మల్లేశం, డీఎంహెచ్‌వో హరీశ్‌రాజ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో మురళీధర్, డీఈ, ఏఈలు శ్రీనివాస్‌రావు, వెంకటేశ్వర్‌రెడ్డి, వైద్యులు దిలీప్, వైస్ ఎంపీపీ శ్యాంసుందర్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
రైతుల పాలిట దేవుడు.. కేసీఆర్
ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ రైతు పక్షపాతిగా ఉండగా, నేడు కేసీఆర్ రైతుల పక్షపాతిగా ఉంటూ దేవుడై నిలిచారని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. సాగునీరు, ఉచిత కరంటు, రైతు బంధు, రైతుబీమా వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అమలు చేస్తున్నారని చెప్పారు. మహిళల సంక్షేమాభివృద్ధికి నాడు ఎన్టీఆర్.. నేడు మహిళా సాధికారకత, అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు.