Urea | నర్సింహులపేట, డిసెంబర్ 24: యాసంగి సీజన్ ఆరంభంలోనే రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) వద్ద అన్నదాతలు బయల్దేరారు. నిన్న యూరియా కోసం రైతు వేదిక వద్ద బారులు తీరిన రైతులకు బస్తాలు ఇవ్వకపోవడంతో అధికారులతో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ పీఏసీఎస్‌కు యూరియా బస్తాలు వచ్చాయనే సమాచారం తెలియడంతో రైతులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. కానీ ఏవోలు అందుబాటులో లేకపోవడంతో యూరియా స్టాక్‌పై సమాధానం చెప్పేవారు లేక ఇబ్బంది పడ్డారు.
ఇక యూరియా బస్తాల కోసం భారీగా వచ్చిన రైతులు పీఏసీఎస్ ముందు భారీగా క్యూ కట్టారు. ఈ క్రమంలో రైతుల మధ్య తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. మొక్కజొన్న సాగు చేస్తున్న అన్నదాతల అవసరాలకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.