వర్ధన్నపేట, ఏప్రిల్ 25: పట్టణంలో దశాబ్దాలుగా ప్రజలకు ఇబ్బందికరంగా మారిన డ్రైనేజీ వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం మెరుగుపరుస్తున్నది. పట్టణ పరిధిలోని అంబేద్కర్ సెంటర్ నుంచి ఆకేరువాగు వరకు గతంలో నిర్మించిన డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రెండేళ్ల క్రితం వర్ధన్నపేటను ప్రభుత్వం మున్సిపాలిటీగా ప్రకటించడంతో పాటు పట్టణ అభివృద్ధికి రూ. 30 కోట్ల నిధులను మంజూరు చేసింది. దీంతో వర్ధన్నపేటలో అంతర్గతరోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరుస్తున్నారు. జాతీయ రహదారి పక్కన సుమారు 40 ఏళ్ల క్రితం నిర్మించిన డ్రైనేజీని ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో ఆధునీకరిస్తున్నారు. కోర్టు నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు రోడ్డు వైండింగ్ చేపడుతూ డ్రైనేజీని అభివృద్ధి చేస్తున్నారు. డ్రైనేజీ పనులు పూర్తయితే ప్రజల ఇబ్బందులు శాశ్వతంగా తొలగిపోనున్నాయి. అధికారులు రెండువైపులా పనులు పూర్తి చేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.