స్వప్రయోజనాలు, ఆస్తుల రక్షణకే బీజేపీలోకి ఈటల
బీసీ నేతగా రాజేందర్‌కు మంత్రి పదవితోపాటు ఉన్నతమైన గుర్తింపు ఇచ్చిన సీఎం కేసీఆర్
మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడి
మహబూబాబాద్/మరిపెడ, జూన్ 4 : టీఆర్ఎస్లో 19 ఏళ్లు పనిచేసిన ఈటల రాజేందర్ ఆత్మగౌరవం కోసం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ దుయ్యబట్టారు. ఆత్మగౌరవం కోసం కాదు.. తన ఆత్మరక్షణ కోసమే ఈటల బీజేపీలో చేరుతున్నారని విమర్శించా రు. శుక్రవారం మహబూబాబాద్‌లోని తన నివాసంలో, మరిపెడలో మంత్రి సత్యవతిరాథోడ్, టీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీకి 19 ఏళ్లు గా ఎంతో సేవ చేశానని చెబుతున్న ఈటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించడమేగాక మంత్రి పదవి ఇచ్చి గౌరవించారని గుర్తు చేశారు. మంత్రి పదవి నుంచి తొలగించి అవమానించారని రాజేందర్ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారన్నారు. పార్టీకి, ప్రజలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడితే మంత్రి పదవి నుంచి తొలగించారని తెలుసుకోకపోవడం ఆయన రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్‌పై ఈటల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి సత్యవతిరాథోడ్ చెప్పారు.
ఈటల ఈ స్థాయికి రావడానికి కారణం కేసీఆరేనని గుర్తు పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. మంత్రి పదవి నుంచి తప్పించగానే బీసీ నినాదంతో ఈటల ప్రజలను మభ్య పెడుతున్నారని విమ ర్శించారు. తనపై ఉన్న కేసుల నుంచి రక్షణకు, ఆస్తుల పరిరక్షణ కోసం బీజేపీ వద్ద ఈటల మోకరిల్లారని ఎద్దేవా చేశారు. బీజేపీలో చేరనున్న ఈటల రాజకీయ భవిష్యత్ ఇంతటితోనే ఖతమన్నారు. ఓ సామాన్యుడు లేఖ రాస్తే విచారణ చేయకుండా తనను మంత్రి పదవి నుంచి తొలగించడం ఎంత వరకు సమంజసమని ఈటల ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో ప్రతి సామాన్యుడు పవర్ఫుల్ వ్యక్తేనని గుర్తుంచుకోవాలని ఆమె స్పష్టం చేశారు. తనకున్న అధికారం ద్వారా నాయకులు ప్రజలకు మరింత సేవ చేయాలి తప్ప మీరు అక్కడి పేద వాళ్ల భూములు లాక్కున్నారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలే హైకమాండ్ అని, సామాన్యులకు అన్యాయం చేస్తే ఊరుకోదని వెల్లడించారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీలో చేరి ఇంకా మొసలి కన్నీరు కార్చడం సిగ్గుచేటన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాలుగు రోజులకే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొన్ని మండలాలను పోలవరం ముంపు ప్రాంతాల పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో కలిపి తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు. ఏడేళ్లుగా తెలంగాణ అభివృద్ధికి చేయూతనివ్వకుండా అడ్డుకుంటున్న బీజేపీలో ఈటల చేరి తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టుపెట్టేలా ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు.
ఢిల్లీ మెడలు వంచిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ తన ప్రాణాలు పణంగా పెట్టి ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అసాధ్యం అనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత వేగంగా నిర్మించి ప్రపంచ దృష్టిని తెలంగాణ వైపు మళ్లించిన ఘనత కేసీఆర్‌దన్నారు. ఎండాకాలం వస్తే నీళ్ల కోసం బిందెలతో ఆడపడుచులు ఘర్షణ పడేవారని, ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా నీళ్లగోస లేకుండా చేసిన ఘనత టీఆర్ఎస్ది కాదా..? అని ఆమె ప్రశ్నించారు. రైతును సార్ అనే రోజులు దగ్గరలోనే ఉన్నాయని దీనిని టీఆర్ఎస్ ప్రభుత్వం నిజం చేస్తుందన్నారు. ఈ క్రమంలోనే రైతులకు ఉచిత విద్యుత్‌తోపాటు రైతుబంధు పథకంలో పంటలకు పెట్టుబడిని అందిస్తున్నదని తెలిపారు. రైతు అకాల మరణం చెందితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా రైతుబీమా పథకంతో ఆదుకుంటుంన్నది టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. బీజేపీ నాయకులు నలుగురు మంత్రులు కాగానే మిడిసిపడ్డారు. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, మున్సిపల్, మహానగర పాలక సంస్థ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అడ్రస్ గల్లంతయిందని ఆమె ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ను ఢీకొట్టగలిగే సత్తా బీజేపీకి లేదని తెలిపారు.
తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ
అన్ని రంగాల్లో వెనకబాటుకు గురైన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధికి చేయూతనివ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై సవతితల్లి ప్రేమ చూపిస్తున్నదని సత్యవతిరాథోడ్ అ న్నా రు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్శిటీ ఏర్పాటుకు కేంద్రం హామీ ఇచ్చి నేటికీ నెరవేర్చలేదన్నారు. తెలంగాణలో త యారవుతున్న కొవిడ్ వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాలకు తరలిస్తూ ఇక్కడి ప్రజలకు అన్యాయం చేస్తున్నదన్నారు. విలేకరుల సమావేశాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, నూకల శ్రీరంగారెడ్డి, షేక్ అఫ్జ ల్, కొంపెల్లి శ్రీధర్ రెడ్డి, మంచు అశోక్, పా దూరి శ్రావణ్‌రెడ్డి, కొంపెల్లి వేణు పాల్గొన్నారు.