మహబూబాబాద్: కురవి మండలంలోని ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఆత్మస్థెర్యం,దృఢనిశ్చయం, క్రమశిక్షణ ఉంటే ఏ రంగంలోనైనా గెలుపు సాధించవచ్చన్నారు మంత్రి. దేహ దారుఢ్యానికే కాకుండా ఆరోగ్యం, మానసిక ఉల్లాసానికి కూడా ఆటలు దోహదపడతాయన్నారు. మానుకోట జిల్లాలో ఈఎంఆర్ఎస్(ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్) సొసైటీ ఆధ్వర్యంలో తొలిసారి గేమ్స్-స్పోర్ట్స్ మీట్ జరగడం సంతోషకరమన్నారు సత్యవతి. నాలుగు రోజుల పాటు జరిగిన పోటీల్లో 23 పాఠశాలల నుంచి 1,300 మంది, మొత్తం 2వేల మంది పాల్గొన్నారని మంత్రి తెలిపారు. అండర్-14, అండర్-19 విభాగాల్లో 17 రకాల పోటీల్లో గెలిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు మంత్రి. విద్యార్థులు ఇలాగే విజయాలు సాధిస్తూ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వ రంగ సంస్థల్లో నాణ్యమైన విద్య, మంచి భోజనం, అన్నిరకాల సౌకర్యాలు కల్పించడంతో పాటు గిరిజన బిడ్డల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని, అందులో భాగస్వామి కావడం నా అదృష్టంగా భావిస్తున్నాని మంత్రి పేర్కొన్నారు. గతంలో తెలుగు మీడియం ఉన్న ఆశ్రమ స్కూల్స్ లో ఇప్పుడు సీబీఎస్ఈ సిలబస్‌తో కూడిన ఇంగ్లీష్ మీడియం విద్య అందుతుందని, ఏడేండ్లలో గురుకులాల అభివృద్ధికి కోట్లాది రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు. గురుకులాల సంఖ్యను 183 కు పెంచామని, 22 డిగ్రీ కాలేజీలు, 332 ఆశ్రమ పాఠశాలలు నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. వచ్చేఏడాది రాష్ట్ర స్థాయి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ క్రీడా పోటీలు గాంధారిలో నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా 99% విజయం సాధిస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఐఐటీ, జేఈఈ, నీట్ సీట్లు సాధించి సత్తా చాటుతున్నారని అన్నారామె. సీఎం కేసీఆర్ గిరిజన రిజర్వేషన్లు పెంచి మరో పదివేల కుటుంబాలకు మేలు చేశారని స్పష్టం చేశారు సత్యవతి రాథోడ్.
త్వరలోనే గురుకులాల్లో డైట్ చార్జీలు, మెస్ చార్జీలు పెంచుతామని మంత్రి హామి ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో అద్దె భవనాలలో ఉన్న ఈఎంఆర్ ఎస్ స్కూళ్లను త్వరలోనే సొంత భవనాలకు తరలిస్తామని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో గురుకులాల సెక్రటరీ రోనాల్డ్ రోస్, జిల్లా కలెక్టర్ శశాంక, ఐటీడీఏ పీవో అంకిత్ , అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్, ఎంపీపీ పద్మ రవి, జడ్పీటీసీ బండి వెంకటరెడ్డి, ఎంపీటీసీ భాస్కర్, ఆర్డీవో కొమరయ్య, ప్రిన్సిపల్ సరిత, రీజనల్ కో-ఆర్డినేటర్ రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.