Sand Mining | నర్సింహులపేట, మార్చి 20: ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట జోరుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఇండ్ల నిర్మాణానికి అవసరమైన దాని కంటే ఎక్కువగా ఇసుకను తరలించి డంప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక డంప్‌లు ఏర్పాటు చేస్తున్నప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఇప్పటికే వందలాది ట్రిప్పుల ఇసుకను ఆకేరు వాగు నుంచి తరలించి, శివారు ప్రాంతాల్లో నిల్వ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలించి, ఒక్కో ట్రిప్పునకు రూ.3వేల నుంచి 4 వేల వరకు అమ్ముతున్నారు. నర్సింహులపేట మండలంలోని లోక్యతండా గ్రామ పంచాయతీ పరిదిలోని చేనున మధ్య దాదాపు 30 నుంచి 50 ట్రాక్టర్ల ఇసుకతో డంప్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి నుంచి సమీప పట్టణాలకు, ఇతర ప్రాంతాలకు ఇసుకను అధిక ధరకు సరఫరా చేస్తున్నారు.
ఆకేరు వాగులో ఇంత పెద్ద ఎత్తున్న ఇసుక దోపిడీ జరుగుతున్నప్పటికీ అధికారులు తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై ఒకవైపు ఎమ్మెల్యే హెచ్చరిస్తున్నా.. అధికారులు మాత్రం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక ట్రాక్టర్ల యజమానులకు అధికారులు కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దందా వెనుక పెద్దల హస్తం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.