మహబూబాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : పుట్ల కొద్దీ వస్తున్న ధాన్యాన్ని నిల్వ చేసేందుకు స్థలం లేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వానకాలం వడ్లతోపాటు గత యాసంగి వడ్లే ఇంకా జిల్లాలోని మిల్లులో నిల్వ ఉండడంతో చేసేదేమీలేక పక్క జిల్లాల మిల్లులకు తరలిస్తున్నారు. ఎఫ్‌సీఐ గోదాముల్లో పేరుకుపోయిన బియ్యం నిల్వలను కేంద్రప్రభుత్వం ఎప్పటికప్పుడు తరలిస్తే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. అవసరం మేరకు రైల్వే ర్యాక్‌లు కేటాయించి బియ్యాన్ని తరలిస్తే గోదాములు ఖాళీ అయ్యేవి. అదే సమయంలో మిల్లర్లు తమ వద్ద ధాన్యాన్ని మిల్లింగ్ చేసి వచ్చిన బియ్యాన్ని ఎఫ్‌సీఐ గోదాములకు తరలించేవారు. ఈ ప్రక్రియ ఒక చైన్ సిస్టంలా నిరంతరం కొనసాగితే జిల్లాలోని మిల్లుల్లో మరింత ధాన్యం నిల్వ చేసే అవకాశం ఉండడంతోపాటు ధాన్యం కొనుగోళ్లు వేగవంతమయ్యేది. కానీ, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తూ ఎఫ్‌సీఐ గోదాముల నుంచి బియ్యాన్ని తరలించకపోవడంతో ఇబ్బందులు తలెత్తున్నాయి. జిల్లాలోని తొర్రూ రు, పెద్దవంగర, కేసముద్రం, నెల్లికుదురు, గూడూరు, కొత్తగూడ, గంగారం, మహబూబాబాద్ మండలాలకు చెందిన మిల్లుల నుంచి బియ్యాన్ని నెక్కొండలో ఉన్న ఎఫ్‌సీఐ గోదాములకు, దంతాలపల్లి, నర్సింహులపేట, చిన్నగూడూరు, కురవి, డోర్నకల్, మరిపెడ మండలాల్లోని మిల్లుల బియ్యాన్ని ఖమ్మం జిల్లాలోని ఎఫ్‌సీఐ గోదాములకు తరలిస్తున్నారు.
కాగా, ఖమ్మం, నెక్కొండలోని ఎఫ్‌సీఐ గోదాములు బియ్యం బస్తాలతో ఫుల్‌గా నిండాయి. ఈ క్రమంలో మిల్లర్లు ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని పంపిద్దామనుకుంటే గోదాముల్లో ఖాళీస్థలం లేదు. దీంతో వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్లు మిల్లుల్లో నిల్వ చేశారు. ఖాళీస్థలం లేకపోవడంతో పొరు గు జిల్లాలైన సూర్యాపేట, వరంగల్‌కు తరలిస్తున్నారు.
జిల్లాలో ఈ వానకాలం సీజన్లో 2.50లక్షల ధాన్యం వస్తుందని అంచనా వేసిన అధికారులు ఇప్పటి వరకు 75 వేల మెట్రిక్ టన్నుల సేకరించారు. మిల్లుల్లో ఇప్పటికే పాత ధాన్యం 40వేల మెట్రిక్ టన్నులు నిల్వ ఉంది. జిల్లాలోని మిల్లుల సామర్థ్యం 1.10లక్షల మెట్రిక్ టన్నులు కాగా, పాత ధాన్యం, ఇప్పటివరకు సేకరించిన వానకాలం ధాన్యంతో అవి నిండాయి. మిల్లుల్లో స్థలం లేకపోవడంతో మిగిలిన వడ్లను వరంగల్, సూర్యాపేట జిల్లాలోని మిల్లులకు తరలిస్తున్నారు. జిల్లాలో ఇంకా 1.25లక్షల ధాన్యం సేకరించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కాకుండా చర్యలు తీసుకుంటూనే ఒక జిల్లా మిల్లుల్లో స్థలం లేకుంటే పక్క జిల్లాల మిల్లులకు తరలిస్తున్నది. కేంద్రప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా రైతులకు ఇబ్బందిపెడుతున్నది.
ఎఫ్‌సీఐ గోదాముల్లో స్థలం లేక సమస్య
జిల్లాలో ఎఫ్‌సీఐ గోదాములు లేవు. మిల్లుల్లో మిల్లాడించిన బియ్యాన్ని ఖమ్మం, వరంగల్ జిల్లా నెక్కొండలోని ఎఫ్‌సీఐ గోదాములకు తరలిస్తు న్నాం. అక్కడి గోదాముల్లో ఖాళీస్థలం లేకపోవడంతో బియ్యం మిల్లుల్లో ఉండిపోతున్నాయి. దీం తో మిల్లర్లు మిల్లింగ్ చేయాల్సిన ధాన్యం అలానే ఉంది. జిల్లాలోని మిల్లుల్లో స్థలం లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని సూర్యాపేట, వరంగల్ జిల్లాలకు తరలిస్తున్నాం.