నర్సింహులపేట: మే31: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం దొంగతనం కలకలం రేపింది. జయపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, దళిత కౌలు రైతు మందుల యాకయ్యకి చెందిన ఆరు క్వింటాళ్ల వరిధాన్యం మాయమైంది. ఇది తెలిసి యాకయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ ఆరు క్వింటాళ్ల ధాన్యం ఒకే రోజు కాకుండా వరుసగా రెండు రోజులు జరగడం గమనార్హం. మొదటి రోజు నాలుగు క్వింటాళ్లు, రెండో రోజు రెండు క్వింటాళ్ల ధాన్యం మాయమైంది. దీనిపై బాధిత రైతు సంబంధిత అధికారులను ఆశ్రయించగా.. నిర్లక్ష్యపు సమాధానమిచ్చారు. మీ ధాన్యానికి మీరే బాధ్యులు.. మాకేం సంబంధమని నిర్లక్ష్యంగా బదులిచ్చారు. కాగా, ధాన్యం కొనుగోలు సెంటర్ పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ ఇలా దొంగతనం జరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.