నర్సింహులపేట, ఆగస్టు 30: ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఐదు రోజుల నుంచి అగొచ్చే ఇగొచ్చే అంటూ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని శనివారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలోని (Narsimhulapeta) పీఎస్ఎస్ కార్యాలయం వద్ద రైతులు ధర్నాకు దిగారు. శనివారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు యూరియా కోసం కార్యాలయం వద్ద పడిగాపులు కాశారు. యూరియా కోసం రోజుల తరబడి తిరుగుతున్నా.. బస్తాలు దొరకపోవడంతో ధర్నా, రాస్తారోకో చేపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పంటల సాగుకు తగ్గట్లుగా ప్రభుత్వం యూరియాను అందించడం లేదని రైతులు ఆరోపించారు. రైతు సమస్యలపై రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ అలసత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ధర్నా విషయం తెలుసుకున్న ఎస్ఐ సురేష్ ఘటన స్థలానికి చేరుకొని రైతులను శాంతిపజేశారు. అనంతరం రైతుల దగ్గర నుండి పట్టాదారు పాస్ పుస్తకాలు ఆధార్ ప్రతులను సేకరించారు.