నర్సింహులపేట, సెప్టెంబర్ 9: నెలల తరబడి తిరిగినా ఒక్క బస్తా యూరియా (Urea) కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. నర్సింహులపేట (Narsimhulapet) మండలంలోని పెద్దనాగారం స్టేజి వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో వాహనాలు ఎక్కడికి అక్కడే ఆగిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులను శాంతిప చేసే ప్రయత్నిం చేశారు. అయినా ధర్నా విరమించకపోవడంతో తొర్రూర్ డీఎస్పీ కృష్ణమోహన్ బస్తాలు వచ్చే విధంగా అధికారులతో మాట్లాడతారని హామీ ఇవ్వడంతో విరమించారు.
కూపన్లు అక్కడ.. యూరియా ఇక్కడ
మండల కేంద్రంతో పాటు జయపురం, పెద్దనాగారం రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతులు క్యూలైన్లో నిలబడ్డారు. కూపన్లు తీసుకున్న రైతులు యూరియా బస్తా కోసం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయానికి పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. క్యూలైన్లో నిలబడలేక రైతులు చెప్పులు పెట్టడంతో పాటు నేలపై కూర్చున్నారు. సుమారు 500 మంది లైన్లో ఉంటే 50 మందికి మాత్రమే టోకెన్లు ఇవ్వడం ఏంటని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తెల్లవారుజాము నుంచే టోకెన్ల కోసం నిల్చుంచున్నామని, అయినా సరిపడా టోకెన్లు ఇవ్వడం లేదని విమర్శించారు.