హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ పదేండ్ల పాలనలోనే మహిళలకు న్యాయం జరిగిందని మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మహిళా పక్షపాతిగా కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, డబుల్ బెడ్రూం, భగీరథ లాంటి పథకాలకు అంకురార్పణ చేశారని గుర్తుచేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మహిళా మాజీ అధ్యక్షురాలు తుల ఉమ ఆధ్వర్యంలో అట్టహాసంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, చంద్రావతి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సబితాఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆధునిక సమాజంలోనూ మహిళలపై వివక్ష కొనసాగడం దురదృష్టకరని.. కానీ ఆత్మవిశ్వాసంతో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. జీవితంలో నిలదొక్కుకొనేదాకా పెళ్లి చేసుకోవద్దని కేటీఆర్ చెప్పిన మాటలు అక్షరసత్యమని చెప్పారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ కనీసం లక్షాధికారులను కూడా చేయలేదంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో మహిళలకు కన్నీళ్లే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెలుగుమట్ల, మూసీ బాధితుల ఉదంతాలే ఇందుకు నిదర్శనమని గుర్తుచేశారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుక్లెట్ తీసుకొస్తామని ప్రకటించారు. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకొనేందుకు మహిళలు సంఘటిత శక్తితో ముందుకు కదలాలని కోరారు.
అవకాశాలను అందిపుచ్చుకోవాలి : సునీతాలక్ష్మారెడ్డి
మహిళలు అవకాశాలను అందిపుచ్చుకొని అన్ని రంగాల్లో రాణించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ మహిళలకు సముచిత గౌరవమిచ్చారని పేర్కొన్నారు. మహిళా నేతలను సొంత బిడ్డల్లా చూసుకున్నారని కొని యాడారు. తనకు మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా అవకాశమిచ్చి ప్రోత్సహించారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పాలనలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ షీటీములు ఏర్పాటు చేశారని చెప్పారు.
పీవీ బాటలోనే మహిళా సాధికారతకు కృషి: ఎమ్మెల్సీ వాణీదేవి
తన తండ్రి పీవీ నర్సింహారావు మహిళలపై వివక్షను సహించకపోయేవారని ఎమ్మెల్సీ వాణీదేవీ గుర్తుచేసుకున్నారు. ఆయన బాటలోనే కేసీఆర్ మహిళా సాధికారత, స్వయం సమృద్ధికి ఎంతగానో కృషిచేశారని ప్రశంసించారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి ప్రజాసేవ వైపు మరల్చిన ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. పోరాడి తెలంగాణను సాధించిన ఆయన తెచ్చుకున్న రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారని కొనియాడారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ లాంటి గొప్ప పథకాలను తెచ్చి గొప్ప సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టారని ప్రశంసలు కురిపించారు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.
రెండేండ్ల పాలనలో పచ్చి మోసం : మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత
అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండేండ్ల పాలనలో మహిళలను అడుగడుగునా దగా చేసిందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత విరుచుకుపడ్డారు. మహాలక్ష్మి పేరిట పచ్చి మోసం చేసిందని మండిపడ్డారు. యువతులకు స్కూటీలు ఇస్తామని, పింఛన్లు పెంచుతామని ఆశలు కల్పించి ఇప్పుడు అరిగోస పెడుతున్నదని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేసేదాకా మహిళలందరూ విశ్రమించవద్దని పిలుపునిచ్చారు.
రిజర్వేషన్ల ఘనత కేసీఆర్‌దే : తుల ఉమ
మార్కెట్ కమిటీలు, స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని బీఆర్ఎస్ మాజీ మహిళా అధ్యక్షురాలు తుల ఉమ కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో మహిళలు కీలక భూమిక పోషించారని గుర్తుచేశారు. బతుకమ్మ, బోనాలతో చైతన్యాన్ని చాటారని చెప్పారు. ఇప్పుడు అదే ఉద్యమస్ఫూర్తితో ముందుకెళ్లి కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు. ఎన్నో ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ఆచరణలో మొండి చెయ్యి చూపిందని నిప్పులు చెరిగారు.
పాటలతో కట్టిపడేసిన మధుప్రియ, రేలారే గంగ
తెలంగాణ భవన్లో నిర్వహించిన మహిళా దినోత్సవానికి హాజరైన తెలంగాణ గాయనీలు మధుప్రియ, రేలారే గంగ ఆటాపాటలతో సభికులను ఉత్సాహపరిచారు. కేసీఆర్‌పై పాటలు పాడి ఉర్రూతలూగించారు. అధికార కాంగ్రెస్ మోసపూరిత విధానాలను పాటల రూపంలో ఎండగట్టారు. అలాగే బీఆర్ఎస్ మహిళా నాయకులు మంత్రి శ్రీదేవి, రజితారెడ్డి సైతం మహిళలపై పాటపాడి ఆకట్టుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా వివిధ రంగాల్లో రాణించిన విజయశ్రీ, లక్ష్మీరెడ్డి, మధులిక, శ్యామ్ తదితరులను బీఆర్ఎస్ తరఫున మహిళా నేతలు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మహిళా నేతలు నిరోషా, సుశీలారెడ్డి, అనితానాయక్, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ పాలన మహిళలకు స్వర్ణయుగం : సత్యవతి రాథోడ్
కేసీఆర్ హయాంలోనే మహిళల గౌరవం పెరిగిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఆయన పాలన మహిళల పాలిట స్వర్ణయుగమని అభివర్ణించారు. మహిళా ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని కొనియాడారు. రాజకీయంగానూ అవకాశాలు కల్పించారని గుర్తుచేశారు. గిరిజన బిడ్డనైన తనకు మంత్రి పదవి ఇవ్వడాన్ని మరచిపోలేనని చెప్పారు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే అతివలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.