మహబూబాబాద్ : అనారోగ్యంతో తండ్రి మరణించడంతో చదువుకునేందుకు ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న యువతికి తండా వాసులు చేయూతనిచ్చారు. ఆ చదువుల తల్లికి తలా కొంత పోగుచేసి ఆర్థిక సాయం(Financial assistance) అందజేశారు. నర్సింహులపేట మండలంలోని అజ్మీర తండా గ్రామ పంచాయతీకి చెందిన పేద కుటుంబానికి చెందిన అజ్మీరా నందిని తండ్రి లచ్చిరాం అనారోగ్యంతో ఇటీవల మరణించాడు. తండ్రి మరణించడంతో చదువుకునేందుకు డబ్బలు లేకపోవడంతో ఇంటి వద్దనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తున్న నందిని కాలేజీ ఫీజు చెల్లించకపోవడంతో గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు, తండాకు చెందిన పలువురు కలిసి నందినికి మంగళవారం రూ.55,500 అందజేశారు. నందిని పై చదువులకోసం దాతలు ముందుకు రావాలని కోరుతున్నారు. ఆర్థిక సహాకారం అందించిన వారిలో అజ్మీరా మోహన్, సునీత, ఝాన్సీ, బానోత్ నగేశ్, సేవ్య, వీరన్న, రెడ్డి, నరేశ్, సునీత, శ్రీరామ్, నరేశ్, రమేశ్ ఉన్నారు.