కురవి, డిసెంబర్ 14 : మిర్చిలో నల్ల తామర పురుగుల కట్టడికి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. బుధవారం మల్యాల కేవీకే సమన్వయకర్త డాక్టర్ మాలతి, శాస్త్రవేత్తలు క్రాంతి కుమార్, రాంబాబు, కిశోర్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఛత్రూనాయక్, జిల్లా హార్టికల్చర్ అధికారి సూర్యనారాయణ కురవి, డోర్నకల్ మండలాల్లోని రాజోలు శివారు హర్యాతండా, కస్నాతండా జీపీ పరిధిలోని ఇస్రా తండాలో మిర్చి పంటలను పరిశీలించారు. మిర్చిలో నల్ల తామర పురుగుల కట్టడికి సలహాలు ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇటీవల జిల్లాలోని పెనుగొండ, నెల్లికుదురు గ్రామాల్లో మిర్చిలో నల్ల తామరను గుర్తించామన్నారు. పురుగుల ఉధృతి పెరుగక ముందే రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
గట్లపై, పొలంలో తామర పురుగులకు ఆశ్రయమిచ్చే కలుపు మొకలు లేకుండా చూడాలన్నారు. ముఖ్యంగా చేలలో ఎకరానికి 20-30 వరకు నీలి, పసుపు రంగు జిగురు అట్టలను ఏర్పాటు చేయాలన్నారు. పంటపై వేప, గానుగ నూనె పిచికారీ చేయాలన్నారు. నత్రజని, యూరియాను మోతాదుకు మించి వేయొద్దని సూచించారు. రెండు లేక మూడు రకాల మందులను కలిపి పిచికారీ చేయడం మానుకోవాలని, మోతాదు పెరిగితే ఏ మందులూ పని చేయకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. మిర్చి పంట చుట్టూ జొన్న, మక్కజొన్న పంటలను వేసుకోవాలన్నారు. వాతావరణం చల్లగా ఉన్నందున సూక్ష్మ, స్థూల పోషకాలను పిచికారీ చేసుకోవాలని శాస్త్రవేత్తలు చెప్పారు. కార్యక్రమంలో ఏడీఏ శోభన్‌బాబు, మండల వ్యవసాయాధికారి మంజాఖాన్, ఏఈవోలు లయ, రవి కుమార్, రైతులు కొండయ్య, బానోత్ భద్రూ నాయక్ పాల్గొన్నారు.