ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 13: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి నరేశ్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే కేసీఆర్ కప్ 2026 క్రికెట్ టోర్నమెంట్‌ను ఓయూలోని సీ గ్రౌండ్లో శుక్రవారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఉపయోగపడతాయన్నారు.
నరేశ్ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు అనుబంధ కళాశాలల నుంచి 25 టీంలు పాల్గొంటున్నాయని చెప్పారు. గెలిచిన జట్టుకు ట్రోఫీతో పాటు రూ.20 వేల నగదు బహుమతి, రన్నరప్ ట్రోఫీతో పాటు రూ.పది వేలు నగదు బహుమతి అందజేస్తామని వివరించారు. కార్యక్రమంలో కొత్తపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వీరమళ్ల రాం నర్సింహ, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చటారి దశరథ్, పెద్దమ్మ రమేశ్, రమేశ్‌గౌడ్, నాయకులు పవన్‌కుమార్, నాగేందర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.