మోదీ తెలంగాణకు చేసిందేమీలేదు
24 గంటల కరంటు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
శంభునిపల్లిలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం
కమలాపూర్, ఆగస్టు 22 : ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలంగాణ రాష్ర్టానికి చేసింది ఏమీలేదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని శంభునిపల్లిలో ఆదివారం టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకేసారి అధికారంలోకి వచ్చారని, మోదీ చేసింది, కేసీఆర్ చేసింది ఏమిటో ఆలోచన చేయాలన్నారు. ఒక్క రూపాయి పని చేయని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలో ప్రజలకు వివరించాలని సూచించారు. ఏడేండ్లలో మోదీ ఏం పథకాలు పెట్టారో.. కేసీఆర్ ఏం పథకాలు పెట్టారో ప్రజలకు వివరించాలన్నారు. రైతు బంధు, రైతు బీమా, సాగుకు 24 గంటల కరం టు, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు వంటి పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అనారు. ఏడేండ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే సంక్షేమ పథకాలు వస్తాయని అనుకోలేదు.. కరంటు ఉంటదో ఉండదోననే సందేహాలు ప్రజల్లో ఉండేవని గుర్తు చేశారు. కేసీఆర్ కరంటు తెస్తడని ఎవరూ ఊహించలేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణపట్నం నుంచి తెలంగాణకు రావాల్సిన కరంటు వాటా అడిగితే చంద్రబాబు ఇవ్వనన్నారని చెప్పారు.
దీంతో కేసీఆర్ రాత్రింబవళ్లు శ్రమించి, మూడేండ్లలో కరంటు కష్టాలు పోగొట్టారన్నారు. ప్రస్తుతం మిగులు కరంటు స్థాయికి తెలంగాణ ఎదిగిందంటే కేసీఆర్ కృషి వల్లనే అన్నారు. ఇతర రాష్ర్టాలకూ కరంటు సరఫరా చేసే స్థాయికి తెలంగాణ వచ్చిందన్నారు. వృద్ధులకు ఆసరా పింఛన్లు ఇచ్చి, ఆత్మగౌరవం నిలబెట్టిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు బంధు తెలంగాణలో ఇస్తరని ఎవరైన అనుకున్నరా? అని అన్నారు. కరోనా కష్టాలున్నా వానకాలం పంటకు పెట్టుబడి కోసం రూ.7,900 కోట్లు రైతుల ఖాతాల్లో ఒకేసారి జమ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అన్నారు. ప్రజల కోసం ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎంకు అండగా ఉండాలని కోరారు. అనంతరం మహిళా కార్యకర్తలు ఎమ్మెల్యే ధర్మారెడ్డికి రాఖీలు కట్టారు. ఈ సమావేశంలో మండల ఇన్చార్జి డాక్టర్ పేర్యాల రవీందర్రావు, సర్పంచ్‌లు పెండ్యాల రవీందర్‌రెడ్డి, లడె గోపాల్, డైరెక్టర్ భవానీ రాజేశ్వర్‌రావు, ఓసీ సంఘాల నాయకులు తక్కళ్లపల్లి సత్యనారాయణరావు, చందుపట్ల నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్‌లు బొల్లం రాజిరెడ్డి, దుండ్ర గోపాల్, గ్రామశాఖ అధ్యక్షుడు తిరుపతి, బుచ్చిరెడ్డి, పాణి, పిడిశెట్టి రమేశ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.