రికార్డుల నిర్వహణ అధ్వానం
అటెండెన్స్ యాప్‌ను వాడాల్సిందే
ఆస్తుల వివరాలను నివేదించాలి
ఐటీడీఏ ఉద్యోగుల సమావేశంలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య
ఏటూరునాగారం, ఆగస్టు 21: ఐటీడీఏలోని వివిధ శాఖల్లో కొనసాగుతున్న డెప్యుటేషన్లు వెంటనే రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. శనివారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలోని గిరిజన సంక్షేమశాఖ ఇంజినీరింగ్, విద్యా, ఐటీడీఏ విభాగాలను ఆయన సందర్శించారు. హాజరు రిజిస్టర్లను పరిశీలించిన కలెక్టర్‌కు ఆయా విభాగాల నుంచి డిప్యుటేషన్‌పై వెళ్లిన ఉద్యోగుల వివరాలు వెలుగు చూశాయి. అనంతరం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఐటీడీఏ పీవో బదిలీ కావడంతో ప్రస్తుతం ఇన్చార్జి పీవోగా కలెక్టర్ కొనసాగుతున్నారు. సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ ఇంజినీరింగ్ విభాగం నుంచి ఎంత మంది డిప్యూటేషన్‌లో ఉన్నారని ఈఈ హేమలతను ప్రశ్నించారు. ఇందులో కొందరు క్వాలిటీ కంట్రోల్ విభాగం, సీఐ కార్యాలయానికి డిప్యుటేషన్‌పై వెళ్లినట్లు తెలిపారు. గిరిజన సంక్షేమ విద్యా విభాగంలో ఎంత మంది డిప్యూటేషన్‌పై వెళ్లారో డీడీ మంకిడి ఎర్రయ్యను కలెక్టర్ ప్రశ్నించారు. కమిషనర్ కార్యాలయానికి డిప్యుటేషన్‌పై వెళ్లిన వారి వివరాలను డీడీ తెలిపారు. ఐటీడీఏలోని డిప్యూటేషన్లపై ఏవో దామోదర్స్వామిని అడిగి వివరాలు తెలుసుకున్న కలెక్టర్ క్వాలిటీ కంట్రోల్ విభాగానికి డిప్యుటేషన్‌పై వెళ్లిన వారు తప్ప, మిగతా అందరివీ రద్దు చేయాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. వీటికి సంబంధించిన ఫైల్తనకు సమర్పించాలన్నారు. ఆయా విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు కేటగిరి వారీగా అందజేయాలని సూచించారు. పాఠశాలల వారీగా టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, మెడికల్ లీవ్స్, ఇంక్రిమెంట్లు, ట్రాన్స్ఫర్స్, ఇతర వివరాలను తనకు అందజేయాలని ఆదేశించారు. పాఠశాలల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను తెలియాజేయాలన్నారు. అటెండెన్స్ యాప్‌ను సోమవారం నుంచి తప్పనిసరిగా అందరూ ఉపయోగించాలని సూచించారు. ప్రతి ఫైల్ ఆన్లైన్ ద్వారా ప్రాసెస్ చేయాలని సూచించారు. పూర్తి వివరాలతో తనకు నివేదికలను అందజేయాలని సంబంధిత శాఖ సూపరింటెండెంట్లు, క్లర్కులను ఆదేశించారు.
ఆస్తుల వివరాలను నివేదించాలి
ఐటీడీఏ, గిరిజన సంక్షేమశాఖ, ఇంజినీరింగ్ విభాగం, జీసీసీ, గురుకులాలకు ఉన్న ప్రభుత్వం ఆస్తుల వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జీసీసీకి ఉన్న వాహనాలు, ఇతర ఆస్తులు, కంప్యూటర్లు, భవనాలు ఇతరత్రా వివరాల నివేదికను సమర్పించాలని జీసీసీ డీఎం ప్రతాప్‌రెడ్డికి సూచించారు. అదే విధంగా ఇంజినీరింగ్, విద్యా విభాగం, గురుకులాలు, ఐటీడీఏకు సంబంధిచిన భూములు, ఇతర ఆస్తుల వివరాల నివేదికను అందజేయాలని, ఐటీడీఏ ఉద్యోగులంతా స్థానికంగానే ఉండాలని ఆదేశించారు.
రికార్డుల నిర్వహణ అధ్వానం
ఐటీడీఏలోని పలు విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ గదులు, రికార్డుల నిర్వహణ తీరుపై అంసతృప్తి వ్యక్తం చేశారు. రికార్డుల గదులు, రికార్డుల నిర్వహణ అధ్వానంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. సెక్షన్ల వారీగా రికార్డుల గదుల్లో ఫైళ్లను భద్రపర్చాలని సూచించారు. ఈసందర్భంగా ఆయా విభాగాల్లోని హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. కార్యాలయం చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచాలని, ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించాలని సూచించారు. సమావేశంలో ఏపీవో వసంతరావు, డీడీ మంకిడి ఎర్రయ్య, ఏవో దామోధర్స్వామి, మేనేజర్ లాల్ నాయక్, ఈఈ హేమలత, డీఈఈ మధుకర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో మంకిడి వెంకటేశ్వర్లు, జీసీసీ డీఎం ప్రతాప్‌రెడ్డి, ఏఏవో సంతోష్, స్టాటిస్టికల్ ఆఫీసర్ రాజ్‌కుమార్, ఆర్సీవో రాజ్యలక్ష్మి, ఏపీవో లక్ష్మీప్రసన్న, వివిధ విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు.